న్యూఢిల్లీ, ఆగస్టు 2: అందంగా ఉండేందుకు, చర్మాన్ని ప్రకాశవంతంగా ఉంచేందుకు యువత ఎంత దూరమైనా వెళ్తుంది. వేడి నీళ్లు, చన్నీళ్లు, బురదలో స్నానం.. ఇలాంటి పద్ధతులన్నీ అవలంబిస్తూ చర్మాన్ని ప్రకాశవంతంగా ఉంచేందుకు నేటి యువత ప్రయత్నిస్తున్నది. ఇప్పుడు వీటి సరసన ఓ కొత్త పద్ధతి వచ్చి చేరింది. బీర్‌తో స్నానం చేయడం లేదా చర్మశుద్ధి చేసుకోవడం. బీర్ టానింగ్గా పిలుచుకునే ఈ పద్ధతి ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉన్నది. అనేకమంది దీన్ని అనుసరిస్తున్నారు. బీర్‌ను ఒంటిపై పోసుకొని, చర్మాన్ని శుద్ధి చేసుకుంటున్నారు. అయితే ఈ పద్ధతి శ్రేయస్కరం కాదని, దీని వల్ల క్యాన్సర్ వచ్చే ఆస్కారం ఉందని డెర్మటాలజిస్టులు హెచ్చరిస్తున్నారు.
బీర్‌తో స్నానం చేయడం వల్ల అందులో ఉండే హాప్ అనే పదార్థం మెలనిన్‌ను ప్రేరేపితం చేసి చర్మాన్ని ప్రకాశవంతంగా మారుస్తుందని యువత నమ్ముతున్నది. యూవీ కిరణాల నుంచి విడుదలయ్యే రేడియేషన్ నుంచి బీర్ టానింగ్ రక్షిస్తుందని వారు విశ్వసిస్తున్నారు. అయితే దీనిపై చర్మ వ్యాధి నిపుణులు భిన్నంగా స్పందిస్తున్నారు. రేడియేషన్ నుంచి బీర్ రక్షణ కల్పిస్తుందనడానికి ఎటువంటి ఆధారాల్లేవని వారు చెబుతున్నారు. దాని వల్ల చర్మ క్యాన్సర్ సోకే ప్రమాదం పొంచి ఉందని హెచ్చరిస్తున్నారు. చర్మం కాంతివంతంగా ఉండేందుకు సన్ ప్రొటెక్షన్ ఫ్యాక్టర్ (ఎస్పీఎఫ్) 30 ఉన్న సన్స్క్రీన్లను వినియోగించాలని డెర్మటాలజిస్టులు చెబుతున్నారు.