Jharkhand | న్యూఢిల్లీ/రాంచీ, ఫిబ్రవరి 4: ముఖ్యమంత్రి పదవికి హేమంత్ సొరేన్ రాజీనామా తర్వాత జార్ఖండ్‌లో జేఎంఎం నేత చంపయీ సొరేన్ నేతృత్వంలో ఏర్పాటైన కొత్త సంకీర్ణ ప్రభుత్వం అసెంబ్లీలో సోమవారం బలపరీక్షను ఎదుర్కోనున్నది. బలపరీక్ష నెగ్గడం అధికార కూటమికి అంత సులువుగా కనిపించడం లేదు. బలపరీక్ష జరుగనున్న 24 గంటల ముందు జేఎంఎం పార్టీకి చెందిన ఒక ఎమ్మెల్యే పార్టీకి, మాజీ సీఎం హేమంత్ సొరేన్‌కు వ్యతిరేకంగా గళం విప్పడం.. మరో ఎమ్మెల్యే టచ్‌లో లేకుండా పోవడం సంకీర్ణ ప్రభుత్వాన్ని కలవరపరుస్తున్నది.
81 స్థానాలు ఉండే జార్ఖండ్ అసెంబ్లీలో మెజార్టీకి అవసరమైన 41 కంటే ఎక్కువగానే తమకు 43 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉన్నదని, ఆ సంఖ్య 46-47 వరకు చేరుకొంటుందని సీఎం చంపయీ సొరేన్తో సహా అధికార పక్ష నేతలు ధీమాగా ఉన్నారు. అయితే కూటమిలోని ఎమ్మెల్యేలు అందరూ సోమవారం జరిగే బలపరీక్షలో ప్రభుత్వానికి అనుకూలంగా ఓటేస్తే సరే.. లేకుంటే సర్కార్ ప్రమాదంలో పడే అవకాశం లేకపోలేదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
హైదరాబాద్ టు రాంచీ..
బీజేపీ ప్రలోభాల భయంతో గత శుక్రవారం హైదరాబాద్‌కు తరలించిన దాదాపు 40 మంది జేఎంఎం కూటమి ఎమ్మెల్యేలు బలపరీక్ష నేపథ్యంలో ఆదివారం తిరిగి రాంచీకి బయలుదేరి వెళ్లారు. ప్రస్తుతం ఉన్న లెక్కల ప్రకారం జేఎంఎం నేతృత్వంలోని అధికార సంకీర్ణ కూటమికి 46 మంది ఎమ్మెల్యేల బలం ఉన్నది. జేఎంఎంకు 28 మంది ఎమ్మెల్యేలు, కాంగ్రెస్‌కు 16, ఆర్జేడీ, సీపీఐ(ఎంఎల్) పార్టీకి ఒక్కరు చొప్పున ఎమ్మెల్యేలు ఉన్నారు. ప్రతిపక్ష బీజేపీ, దాని మిత్రపక్ష పార్టీలకు కలిపి 29 మంది శాసనసభ్యులు ఉన్నారు. అయితే ఇద్దరు జేఎంఎం ఎమ్మెల్యేలు పార్టీ నాయకత్వంపై అసంతృప్తితో ఉన్నారని, వీరు ఓటింగ్‌కు గైర్హాజరయ్యే అవకాశం ఉన్నదనే ప్రచారం జరుగుతున్నది.
ఓటింగ్‌కు గైర్హాజరు అయితే..
జేఎంఎం ఎమ్మెల్యే లోబిన్ హెమ్‌బ్రోమ్ ఆదివారం మీడియాతో మాట్లాడుతూ గత హేమంత్ సొరేన్ సర్కార్‌పై విమర్శలు గుప్పించడం సంచలనంగా మారింది. తన సలహాను విస్మరించినందుకే హేమంత్‌కు ఈ పరిస్థితి(అరెస్టు) ఏర్పడిందని విమర్శించారు. చోటా నాగ్‌పుర్ అద్దె చట్టం, సంథాల్ పరగణాల అద్దె చట్టం తీసుకొస్తామని జేఎంఎం 2019 ఎన్నికల మ్యానిఫెస్టోలో హామీ ఇచ్చిందని, అయితే అవి అమలు కాలేదని పేర్కొన్నారు.
ఎయిర్‌పోర్టులు, డ్యామ్‌లు, పరిశ్రమల పేరుతో రాష్ట్ర ప్రభుత్వం గిరిజనుల భూములను గుంజుకొన్నదని ఆరోపించారు. హెమ్బ్రోమ్తో తాము మాట్లాడామని, ఆయన సోమవారం జరిగే బలపరీక్షకు హాజరవుతారని జేఎంఎం నేత సుప్రియో భట్టాచార్య తెలిపారు. మరోవైపు బిషున్‌పూర్ ఎమ్మెల్యే చంమ్రా లిండా కూడా ఇప్పటి వరకు టచ్‌లోకి రానట్టు తెలుస్తున్నది. లిండా అనారోగ్యంగా ఉన్నారని జేఎంఎం నేతలు చెబుతున్నప్పటికీ, ఆయన గతంలో జేఎంఎం ప్రభుత్వంపై విమర్శలు చేశారు.