Supreme Court | ఎన్నికల కమిషనర్ల నియామకానికి సంబంధించిన చట్టాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. ప్రధాన ఎన్నికల కమిషనర్‌తో పాటు ఇతర ఎన్నికల కమిషనర్ల నియామకానికి నిష్పాక్షిక, స్వతంత్ర ఎంపిక కమిటీని ఏర్పాటు చేసేలా కేంద్రాన్ని ఆదేశించాలని పిటిషన్లో కోరారు. ఎన్నికల కమిషనర్ల నియామకంలో కేంద్రం పూర్తిగా పారద్శకత పాటించేలా చూడాలని పిల్లో కోరారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం కొత్తగా సీఈసీ, ఈసీ నియామక బిల్లును పార్లమెంట్లో ఆమోదించగా.. డిసెంబర్ 28న గెజిట్ నోటిఫికేషన్ సైతం విడుదలైన విషయం తెలిసిందే.
సీఈసీ, ఈసీల నియామకానికి సంబంధించిన బిల్లులోని క్లాజ్ 10ను కేంద్రం సవరించింది. ప్రధానమంత్రి, లోక్‌సభలో ప్రతిపక్ష నేత, కేంద్ర మంత్రితో కూడిన కమిటీ ఎన్నికల కమిషనర్లను నిర్ణయించాలని బిల్లు నిర్దేశించింది. కమిటీలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి స్థానంలో కేంద్ర మంత్రిని ఉంచారు. ప్రధాన ఎన్నికల కమిషనర్, కమిషనర్లకు సుప్రీంకోర్టు న్యాయమూర్తులతో సమానమైన జీతం అందనున్నది. ప్రయోజనాలు లభిస్తాయని ప్రభుత్వం బిల్లులో సవరణ తెచ్చింది.
తొలిసారిగా ప్రవేశపెట్టిన బిల్లులో కేబినెట్ సెక్రెటరీకి సమానంగా జీతం ఇవ్వాలని నిబంధన ఉండగా.. ఇది ఎన్నికల కమిషనర్ల స్థాయిని తగ్గించినట్లేనన్న విమర్శలు రాగా.. సుప్రీంకోర్టు న్యాయమూర్తికి చెల్లించే వేతనంతో సమానంగా చెల్లించేలా సవరణలు తీసుకువచ్చింది. అయితే, అలవెన్సులు, ఇతర సౌకర్యాల్లో మాత్రం వ్యత్యాలుంటాయి. ప్రధాన ఎన్నికల కమిషనర్, కమిషనర్లు తమ విధులను నిర్వర్తిస్తున్నప్పుడు అన్ని క్రిమినల్, సివిల్ దావాల నుంచి బిల్లు రక్షణను కల్పిస్తుంది. సెక్షన్ 15 (ఎ) ఎన్నికల ప్రక్రియలో ప్రధాన ఎన్నికల కమిషనర్, ఎన్నికల కమిషనర్ తీసుకున్న నిర్ణయాలకు వ్యతిరేకంగా ఎలాంటి ఎఫ్ఐఆర్ దాఖలు చేయరాదు.
అయితే, కోర్టుల్లో మాత్రమే సవాల్ చేసేందుకు అవకాశం ఉంటుంది. చట్టంలో కమిషనర్ల సెర్చ్ ప్యానెల్ ఫార్మాట్‌ను మార్చారు. సవరణ తర్వాత, ఇప్పుడు కమిషనర్ నియామకానికి ముందు, దేశంలోని న్యాయ మంత్రి, భారత ప్రభుత్వంలో కార్యదర్శి స్థాయి ఇద్దరు అధికారులు ఐదుగురు వ్యక్తులతో కూడిన ప్యానెల్‌ను సిద్ధం చేస్తారు. సెర్చ్ కమిటీ ఐదుగురిని సిఫార్సు చేసేందుకు అవకాశం ఉంటుంది. కేబినెట్ సెక్రటరీ స్థానంలో న్యాయశాఖ మంత్రిని సెర్చ్ కమిటీకి అధిపతిగా నియమిస్తూ ప్రభుత్వం సవరణలు తీసుకువచ్చింది. సెక్షన్ 11 ఆధారంగా సీఈసీ, ఈసీల తొలగింపు ఉంటుంది.