Mallikarjun Kharge : రాజ్యసభ ఛైర్మన్, భారత ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్ పక్షపాత వైఖరితో వ్యవహరిస్తున్నారని కాంగ్రెస్ పార్టీ జాతీయాధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే విమర్శించారు. ఛైర్మన్ ధన్‌ఖడ్ ప్రవర్తన ఆ పదవి గౌరవానికి విరుద్ధంగా ఉన్నదని అన్నారు. ఆయన ప్రతిపక్ష నేతలను లక్ష్యంగా చేసుకుంటున్నారని, తరచూ ప్రభుత్వంపై ప్రశంసలు కురిపిస్తున్నారని ఆరోపించారు.
ఇండియా కూటమి నేతలతో కలిసి మీడియాతో మాట్లాడిన ఖర్గే.. రాజ్యసభ ఛైర్మన్ ధన్‌ఖడ్ ఒక ప్రధానోపాధ్యాయుడిలా వ్యవహరిస్తున్నారని ఖర్గే చెప్పారు. అనుభవజ్ఞులైన ప్రతిపక్ష నేతలకు ఛైర్మన్ ధన్‌ఖడ్ ఉపన్యాసాలు ఇస్తున్నారని, వారిని మాట్లాడకుండా నిలువరిస్తున్నారని విమర్శించారు. రాజ్యసభలో అంతరాయాలకు ఛైర్మనే ప్రధాన కారణమని ఆరోపించారు. ఆయన ప్రభుత్వానికి అధికార ప్రతినిధిలా వ్యవహరిస్తున్నారని అన్నారు.
ఛైర్మన్‌పై ఎలాంటి వ్యతిరేకత లేకపోయినా ఆయన ప్రవర్తనతో విసిగిపోయామని, అందుకే ఆయన తొలగింపు కోసం నోటీసులతో ముందుకెళ్లడం మినహా తమకు వేరే మార్గం లేదని ఖర్గే అన్నారు. అయితే 1952 నుంచి ఇప్పటివరకు రాజ్యాంగంలోని ఆర్టికల్ 67 కింద ఉపరాష్ట్రపతికి వ్యతిరేకంగా అవిశ్వాస తీర్మానం పెట్టడం ఇదే తొలిసారని చెప్పారు. గతంలో ఆ పదవి చేపట్టిన ఎవరూ రాజకీయాలు చేయలేదని, నిష్పక్షపాతంగా వ్యవహరించారని అన్నారు.