న్యూఢిల్లీ : భారత అంతరిక్ష పరిశోధనా కేంద్రం (ఇస్రో)లో ఇటీవల స్వచ్ఛంద పదవీ విరమణలు, రాజీనామాలు పెరిగిపోతున్నాయి. సైంటిస్టులు, ఇంజినీర్లు పెద్ద సంఖ్యలో తమ పదవులను వదులుకోడానికి సిద్ధం అవుతున్నారు. దీంతో ఇప్పటికే ఇస్రో చేపట్టిన గగన్యాన్, చంద్రయాన్ ప్రాజెక్టులతో పాటు ఇతర కీలక మిషన్లపై తీవ్ర ప్రభావం పడుతోంది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గగన్యాన్, ఇతర కీలక మిషన్లు లేదా ప్రాజెక్టులు పూర్తయ్యే వరకు గ్రూప్-ఎలోని శాస్త్రీయ, సాంకేతిక సిబ్బంది నుంచి ఎలాంటి పదవీ విరమణ లేదా స్వచ్ఛంద రాజీనామాల కోసం వచ్చే అభ్యర్థనలను అంగీకరించొద్దని ఇస్రో సెంటర్ డైరెక్టర్లు, యూనిట్ హెడ్లను కేంద్రం ఆదేశిస్తూ ఓ మెమో జారీ చేసింది.
సైంటిస్టు లేదా ఇంజినీర్ ఎస్జీ ర్యాంకు సిబ్బంది నుంచి వచ్చే అభ్యర్థనలను ఇస్రో డైరెక్టర్లు కచ్చితమైన సిఫార్సులతో శాఖకు పంపొచ్చని కేంద్రం సూచించింది. ఈ మేరకు కేంద్ర అంతరిక్షశాఖ ఓ మెమోను జారీ చేసింది. ఇటీవల ఇస్రో సంస్థలో పెద్ద ఎత్తున రాజీనామాలు, స్వచ్ఛంద పదవీ విరమణ అభ్యర్థనలు వచ్చినట్టు కేంద్రం గుర్తించింది. ఇందులో చాలా మంది సీనియర్లు కూడా ఉన్నారు. వీరంతా పని విషయంలో వస్తున్న విభేదాలతో పాటు అంతర్గత విభేదాలతో రాజీనామాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. దీంతో పాటు ఇండియాలోని ఓ ప్రైవేట్ అంతరిక్ష పరిశోధన కేంద్రంలో మంచి అవకాశాలు వస్తుండటంతో అటువైపు వెళ్తున్నారనే ప్రచారం కూడా ఉంది.