న్యూఢిల్లీ: దేశంలోని జైళ్ల ఆధునీకరణ కోసం వచ్చే ఆర్థిక సంవత్సరంలో రూ.300 కోట్ల బడ్జెట్ కేటాయింపును కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. (Union Budget 2025) అయితే గత ఆర్థిక సంవత్సరంలో కూడా ప్రస్తుతం మాదిరిగానే రూ.300 కోట్లు కేటాయించారు. ఆ తర్వాత దానిని రూ.75 కోట్లకు సవరించారు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ శనివారం పార్లమెంట్లో కేంద్ర బడ్జెట్ను ప్రవేశపెట్టారు. 2025-26 ఆర్థిక సంవత్సరంలో జైళ్ల ఆధునీకరణ కోసం రూ.300 కోట్లు ఖర్చు చేయనున్నట్లు వెల్లడించారు.
కాగా, 2024-25 ఆర్థిక సంవత్సరంలో జైళ్ల ఆధునీకరణ కోసం బడ్జెట్లో తొలుత రూ.300 కోట్లు కేటాయించారు. అయితే ఆ తర్వాత దానిని రూ.75 కోట్లకు కేంద్ర ప్రభుత్వం సవరించింది. 2023-24లో జైళ్ల ఆధునీకరణకు రూ.86.95 కోట్లు కేటాయించారు.
మరోవైపు సమర్థవంతమైన జైళ్ల నిర్వహణ, సంస్కరణలకు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నది. దీని కోసం 2023 మేలో సమగ్ర ‘మోడల్ జైళ్ల చట్టాన్ని’ ఖరారు చేసింది. హై సెక్యూరిటీ జైలు, ఓపెన్ జైళ్ల ఏర్పాటు, జైళ్ల నిర్వహణ, కరడుగట్టిన నేరస్తులు, ఇతర నేరస్తుల నుంచి సమాజాన్ని రక్షించడం, ఖైదీలకు సంక్షేమ కార్యక్రమాలు, పునరావాస సేవలు వంటివి ఈ చట్టంలో ప్రతిపాదించారు.