న్యూఢిల్లీ: క్రిమినల్ కేసుల్లో దోషులుగా తేలిన రాజకీయ నేతలు రాజకీయ పదవులను చేపట్టకుండా జీవిత కాలం నిషేధించడం కఠిన చర్య అవుతుందని సుప్రీంకోర్టుకు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ప్రస్తుత విధానం ప్రకారం ఇటువంటివారిని ఆరు సంవత్సరాలపాటు అనర్హులను చేయడం సరిపోతుందని చెప్పింది. ఎంత కాలం అనర్హులుగా ప్రకటించాలనేది పూర్తిగా పార్లమెంట్ పరిధిలోని అంశమని తెలిపింది. దామాషా, సమంజసత్వ సిద్ధాంతాలను పరిగణనలోకి తీసుకుని, దోషిని ఎంత కాలం అనర్హుడిగా ప్రకటించాలి? అనే దానిని సభ నిర్ణయిస్తుందని వివరించింది.
అడ్వకేట్ అశ్విని ఉపాధ్యాయ దాఖలు చేసిన పిటిషన్‌పై స్పందించిన కేంద్రం ఈ మేరకు అఫిడవిట్‌ను సుప్రీంకోర్టుకు సమర్పించింది. ఎంపీలు, ఎమ్మెల్యేలపై కేసులను వేగంగా పరిష్కరించాలని, దోషులుగా నిర్ధరణ అయిన నేతలపై జీవిత కాలం నిషేధం విధించాలని పిటిషనర్ కోరారు. పిటిషనర్ లేవనెత్తిన అంశాలు విస్తృత స్థాయి పర్యవసానాలు కలిగినవని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఇవి పార్లమెంటు శాసన విధానం పరిధిలోనివని చెప్పింది. అనర్హత వేటు వేయడానికి తగిన కారణాలను, దాని కాల వ్యవధిని నిర్ణయించడానికి పార్లమెంటుకు రాజ్యాంగం అధికారం కల్పించిందని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.