న్యూఢిల్లీ : ప్రభుత్వ రంగానికి (పీఎస్‌యూ) చెందిన ఉద్యోగి ఉద్యోగం నుంచి డిస్మిస్ లేదా ఉద్వాసన పొందితే తన పదవీ విరమణ ప్రయోజనాలను కోల్పోవలసి వస్తుందని కేంద్రం మంగళవారం ప్రకటించింది. అయితే బర్తరఫ్ లేదా ఉద్వాసన అంశం సంబంధిత పాలనా వ్యవహారాలు చూసే శాఖ సమీక్షకు లోబడి ఉంటుందని తెలిపింది. ఇందుకు సంబంధించి కేంద్ర సివిల్ సర్వీసెస్(పింఛను) నిబంధనలు, 2021లో కీలక మార్పులను కేంద్ర సిబ్బంది శాఖ తీసుకువచ్చింది.
ఇటీవలే నోటిఫై చేసిన సవరణ నిబంధనలు, 2025 ప్రకారం పీఎస్యూలో ఏ ఉద్యోగి అయినా దుష్ప్రవర్తన కారణంగా సర్వీసు నుంచి బర్తరఫ్ లేదా ఉద్వాసనకు గురైన పక్షంలో ప్రభుత్వంలో చేసిన సర్వీసుతోసహా తాను చేసిన సర్వీసుకు సంబంధించి తన రిటైర్మెంట్ బెనిఫిట్స్‌ని కోల్పోవలసి వస్తుంది. 2003 డిసెంబర్ 31 కన్నా ముందు నియమితులైన ప్రభుత్వ ఉద్యోగులు అందరికీ ఈ నిబంధనలు వర్తిస్తాయని నోటిఫికేషన్ పేర్కొంది.