న్యూఢిల్లీ: తాగునీరు, పారిశుద్ధ్య శాఖకు 2025-26 కేంద్ర బడ్జెట్లో రూ.74,226 కోట్లు కేటాయించారు. (Union Budget 2025) గ్రామీణ గృహాలకు తాగు నీటి కనెక్షన్లు అందించేందుకు లక్ష్యంగా పెట్టుకున్న జల్ జీవన్ మిషన్ (జేజేఎం)కు ఇందులో ఎక్కువ నిధులు కేటాయించారు. 2024-25 సంవత్సరానికి సవరించిన అంచనా రూ.29,916 కోట్ల కన్నా గణనీయంగా నిధులు పెరిగాయి. అయితే 2024-25 బడ్జెట్లో ఈ శాఖకు మొదట కేటాయించిన రూ.77,390.68 కోట్ల కంటే ఈ నిధులు తక్కువే.
కాగా, 15 కోట్ల గ్రామీణ ఇళ్లకు కుళాయి నీటి కనెక్షన్లు అందించే లక్ష్యంతో కేంద్రం చేపట్టిన ప్రధాన కార్యక్రమమైన జల్ జీవన్ మిషన్ (జేజేఎం)కు అత్యధికంగా రూ.67,000 కోట్లు కేటాయించారు. 2024-25లో సవరించిన అంచనాలు రూ.22,694 కోట్లుగా ఉండగా ప్రస్తుతం ఇది గణనీయంగా పెరిగింది. ఈ మిషన్ను 2028 వరకు పొడిగించనున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు.
మరోవైపు జేజేఎం కింద సమాచారం, విద్య, కమ్యూనికేషన్ల కోసం రూ.80 కోట్లు, మిషన్ నిర్వహణకు రూ.13.50 కోట్లు, డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వాటర్ అండ్ శానిటేషన్ (SPM-NIWAS)కు రూ. 89.53 కోట్లు కేటాయించారు.
కాగా, జలవనరులు, నదుల అభివృద్ధి, గంగా పునరుజ్జీవన శాఖకు ఈ బడ్జెట్లో రూ.25,276.83 కోట్లు కేటాయించారు. సవరించిన అంచనాల నుంచి రూ.21,640.88 కోట్లు పెరిగింది. నమామి గంగే మిషన్-2 కింద నదిని శుభ్రపరచడం, పునరుజ్జీవింపజేయడం కోసం రూ.3,400 కోట్లు కేటాయించారు. గత బడ్జెట్లో రూ.3,000 కోట్లు పేర్కొన్నారు.
మరోవైపు ఆంధ్రప్రదేశ్లో తాగునీరు, నీటిపారుదల సౌకర్యాలకు లక్ష్యంగా పెట్టుకున్న పోలవరం ప్రాజెక్టుకు ఈ బడ్జెట్లో రూ. 5,936 కోట్లు కేటాయించారు. ఇతర కీలక ప్రాజెక్టులలో భూగర్భ జల నిర్వహణ పథకమైన అటల్ భుజల్ యోజనకు రూ.1,780 కోట్లు, భూగర్భ జల నియంత్రణకు రూ.509 కోట్లు బడ్జెట్లో పేర్కొన్నారు.
కాగా, గ్రామాల్లో బహిరంగ మలవిసర్జన రహిత (ఓడీఎఫ్) పరిస్థితిని కొనసాగింపు, వ్యర్థాల నిర్వహణ వ్యవస్థల అమలుకు లక్ష్యంగా పెట్టుకున్న స్వచ్ఛ భారత్ మిషన్ (గ్రామీణ్)కు గత సంవత్సరం మాదిరిగానే రూ. 7,192 కోట్లు కేటాయించారు. అత్యంత దుర్బల గిరిజన వర్గాలకు నీరు, పారిశుద్ధ్య సౌకర్యాల పథకం ప్రధాన మంత్రి జనజాతి ఆదివాసీ న్యాయ మహా అభియాన్ (PM-JANMAN) కోసం రూ. 341.70 కోట్ల నిధులు ఖర్చు చేయనున్నారు.