‘మీరు ఏ రకమైన వివరణ ఇచ్చినా ఇది ఆమోదయోగ్యమైనది కాదు. న్యాయ
సంస్కరణలపై చర్చ కోసం మీరు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి, మిగతా
జడ్జీలకు నోటీసులు పంపిస్తారా? ప్రధాన ఎన్నికల కమిషనర్‌ను సమావేశానికి పిలిచే అధికారం ప్రధానికి కూడా లేదు’
-మాజీ ప్రధాన ఎన్నికల అధికారి ఎస్‌వై ఖురేషీ
న్యూఢిల్లీ, డిసెంబర్ 17: స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన ఎన్నికల సంఘం (ఈసీ)పై కేంద్రం పెత్తనాన్ని చెలాయిస్తున్నది. ‘ఎన్నికల సంస్కరణల్లో భాగంగా దేశవ్యాప్తంగా ఒకే ఓటరు జాబితా రూపకల్పనపై ప్రధాని మోదీ ప్రిన్సిపల్ సెక్రెటరీ పీకే మిశ్రా అధ్యక్షతన జరిగే సమావేశానికి ప్రధాన ఎన్నికల కమిషనర్(సీఈసీ) హాజరవుతారని భావిస్తున్నాం’ అంటూ కేంద్ర న్యాయశాఖ ఈసీకి లేఖ రాయడంపై వివాదం రేగింది. కేంద్రం చర్య దిగ్భ్రాంతిని కలిగించిందని మాజీ ప్రధాన ఎన్నికల అధికారి ఎస్‌వై ఖురేషీ అన్నారు. సీఈసీని సమావేశానికి పిలిచే అధికారం ప్రధానికి కూడా లేదని పేర్కొన్నారు. ప్రధాని కార్యాలయం (పీఎంవో) నుంచి ఈసీకి నోటీసులు వెళ్లడం అనేది స్వతంత్ర భారతంలో ఎన్నడూ చూడలేదని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి రణ్‌దీప్ సూర్జేవాలా తీవ్రంగా విమర్శించారు. బీజేపీ స్వతంత్ర వ్యవస్థలను ధ్వంసం చేస్తున్నదని, ఈసీని తమ తాబేదారుగా భావిస్తున్నదని ఆరోపించారు.
ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌లో కథనం
పీఎంవో నేతృత్వంలో పీకే మిశ్రా అధ్యక్షతన రేపు వర్చువల్ సమావేశం జరుగుతుందని నవంబర్ 15న కేంద్ర న్యాయశాఖ ఎన్నికల సంఘానికి లేఖ రాసింది. దీనిపై సీఈసీ సుశీల్ చంద్ర, ఎన్నికల కమిషనర్లు రాజీవ్ కుమార్, అనూప్ చంద్ర పాండే అసహనం వ్యక్తం చేశారు. భేటీలో పాల్గొనవద్దని నిర్ణయించుకొన్నారు. వారి కింది అధికారులు వర్చువల్ కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు. అయితే, కొద్ది సేపటి తర్వాత ముగ్గురు ఎన్నికల కమిషనర్లు కాన్ఫరెన్స్‌లోకి వచ్చారు. ఈ మేరకు ఇండియన్ ఎక్స్‌ప్రెస్ శుక్రవారం కథనం ప్రచురించింది.
భేటీ తర్వాతే సంస్కరణలకు ఆమోదం
ఈ కథనంపై ఈసీ అధికారులు స్పందించారు. సంస్కరణలపై పీఎంవో, ఈసీ మధ్య ఇటీవల ‘అనధికారిక’ భేటీ జరిగిందని తెలిపారు. దీనికి సీఈసీ, ఎన్నికల కమిషనర్లు హాజరయ్యారని పేర్కొన్నారు. ఈ సమావేశం తర్వాతనే.. బుధవారం కేంద్ర క్యాబినెట్ ఎన్నికల సంస్కరణలకు ఆమోదం తెలిపిందని వెల్లడించారు. ఎన్నికల సంస్కరణల కోసం ఈసీ పలుమార్లు కేంద్రంపై ఒత్తిడి తీసుకువచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. ‘ఈసీ కోరుతున్న సంస్కరణలను వివరించడానికి పీఎంవో ఇటీవల అనధికారిక సమావేశం ఏర్పాటు చేసింది. దీనికి ప్రధాన ఎన్నికల కమిషనర్, కమిషనర్లు హాజరయ్యారు’ అని అధికారులు తెలిపారు. ఓటరు కార్డుతో ఆధార్ నంబర్ అనుసంధానం, ఏడాదికి నాలుగు సార్లు ఓటరు నమోదు ప్రక్రియ తదితర సంస్కరణలకు కేంద్ర క్యాబినెట్ ఇటీవలే ఆమోదం తెలిపింది.
ఆమోదయోగ్యం కాదు
సమావేశానికి హాజరు కావాలంటూ ఎన్నికల సంఘానికి కేంద్రం లేఖ రాయడం ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదని మాజీ ఎన్నికల కమిషనర్లు అభిప్రాయపడుతున్నారు. అంతే కాకుండా, తర్వాత జరిగిన అనధికారిక సమావేశం కూడా ఎన్నికల సంఘానికి ఉన్న ప్రతిష్ఠను, స్వతంత్రతను దెబ్బతీస్తుందని పేర్కొన్నారు. ‘ఇది చాలా తప్పు’ అని ఎస్‌వై ఖురేషీ అన్నారు. సంస్కరణలపై కేంద్రానికి ఏదైనా వివరణ కావాలంటే రాతపూర్వకంగా కోరాలని, సమావేశాలకు పిలువొద్దని, ఇది అనుమానాలకు తావిస్తుందని మాజీ సీఈసీ టీఎస్ కృష్ణమూర్తి అన్నారు.