న్యూఢిల్లీ: లఖీంపూర్ ఖేరీ ఘటనపై మొత్తానికి కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా తనయుడు ఆశిశ్ మిశ్రాకు యూపీ పోలీసులు సమన్లు జారీ చేశారు. విచారణకు హాజరు కావాలని అడిగారు. ఈ కేసుకు సంబంధించి ఐజీ రేంజ్ లక్ష్మీ సింగ్ స్పందిస్తూ.. చాలా ఆధారాలు లభించాయని, ఇద్దరిని విచారణ కోసం పిలిచామని చెప్పారు. లఖీంపూర్‌లో రైతులను తొక్కించిన వాహనంలోనే ఆశిశ్ మిశ్రా ఉన్నారన్న ఆరోపణలు ఉన్నాయి.
తన కుమారుడు ఆ సమయంలో అక్కడ లేడని అజయ్ మిశ్రా వాదిస్తున్నారు. ఆశిశ్ అక్కడ ఉన్నట్లు ఒక్క ఆధారం లభించినా తాను మంత్రి పదవికి రాజీనామా చేస్తాననీ ఆయన ప్రకటించిన విషయం తెలిసిందే. మరోవైపు ఈ ఘటనపై గురువారం సుప్రీంకోర్టు విచారణ జరిపింది. ఈ కేసులో ఎంత మందిని అరెస్ట్ చేశారు వంటి పూర్తి వివరాలతో శుక్రవారం సవివర నివేదికను సమర్పించాలని యూపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది.