Anurag Thakur | బెంగాల్ లో చిత్తరంజన్ దాస్ జాతీయ కేన్సర్ ఇనిస్టిట్యూట్ ప్రారంభోత్సవం ఓ వివాదంగా మారింది. దీనిని ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం వర్చువల్‌గా ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమంలో సీఎం మమత కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం మమత మాట్లాడుతూ… ఈ ఇనిస్టిట్యూట్ ప్రారంభోత్సవం కొన్ని రోజుల క్రిందటే అయిపోయిందని సాక్షాత్తూ ప్రధాని మోదీ ముందరే వ్యాఖ్యానించారు. అయినా మోదీ ఏమీ మాట్లాడలేదు. ఇప్పుడు ఈ వివాదం బీజేపీ, తృణమూల్ మధ్య చిచ్చు రాజేస్తోంది.
ఈ విషయంపై కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ ఘాటుగా విమర్శలు గుప్పించారు. తాత్కాలిక కోవిడ్ కేంద్రానికి, అంతర్జాతీయ ప్రమాణాలతో ఉన్న కేన్సర్ సంస్థకు తేడా తెలుసుకుంటే బాగుంటుందని మమతకు చురకలంటించారు. రాష్ట్రంలో కోవిడ్ వేగంగా విస్తరిస్తోందని, ఆమెకు ఈ విషయం ఏమాత్రం పట్టదని విమర్శించారు. తెలియని విషయాల గురించి మాట్లాడే బదులు, ఈ విషయంపై మాట్లాడితే బాగుంటుందని అనురాగ్ ఠాకూర్ ఎద్దేవా చేశారు.
ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రధాని నరేంద్ర మోదీకి ఝలక్ ఇచ్చారు. ప్రధాని మోదీ వర్చువల్ విధానం ద్వారా చిత్తరంజన్ దాస్ కేన్సర్ ఇనిస్టిట్యూట్ రెండో క్యాంపస్‌ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ప్రధాని మోదీ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం మమత మాట్లాడుతూ… ఈ కార్యక్రమం ఇంతకు ముందే జరిగిపోయిందని సంచలన వ్యాఖ్యలు చేశారు. కోవిడ్ విజృంభణ సమయంలో తమకు ఓ కోవిడ్ సెంటర్ అవసరమైందని, అప్పుడే ఈ క్యాంపస్‌ను చూశానని పేర్కొన్నారు. ఇందులో రాష్ట్రం వాటా కూడా ఉందని, ఇప్పటికే 25 శాతం నిధులు కూడా ఇచ్చామని మమత పేర్కొన్నారు.