న్యూఢిల్లీ, జనవరి 18: కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (పీఐబీ) ఏదేని సమాచారాన్ని ఫేక్ అని నిర్ధారిస్తే.. సోషల్ మీడియాతో సహా అన్ని వేదికల్లోనూ ఇకపై ఆ సమాచారాన్ని తొలగించాల్సి ఉంటుంది. ఈ మేరకు ఐటీ నిబంధనలు-2021లో సవరణలు చేసేందుకు కేంద్రం నిర్ణయించింది. ఇందుకు సంబంధించిన ముసాయిదాను ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ వెబ్సైట్లో అప్లోడ్ చేసింది. భవిష్యత్తులో పీఐబీ ఫ్యాక్ట్ చెకింగ్ యూనిట్ మాత్రమే కాకుండా, ప్రభుత్వం అనుమతి ఇచ్చిన అధీకృత సంస్థలకు కూడా ఫేక్ న్యూస్‌ను నిర్ధారించే అవకాశం ఉంటుంది. ఏదైనా సమాచారాన్ని ఆ సంస్థలు ఫేక్ అని పేర్కొంటే .. ఆ సమాచారాన్ని యూజర్లు ప్రదర్శించకుండా, అప్లోడ్ చేయకుండా, సరిదిద్దకుండా, ప్రచురించకుండా, ప్రసారం చేయకుండా, నిల్వ చేయకుండా, అప్డేట్ చేయకుండా, పంచుకోకుండా సోషల్ మీడియా లేదా ఇతర ఆన్లైన్ సంస్థ తగిన ప్రయత్నాలు చేయాలని ముసాయిదా పేర్కొంది.
ప్రభుత్వ ప్రతిపాదనపై నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఫేక్‌న్యూస్ అవునా కాదా అనేది నిర్ణయించడంపై ప్రభుత్వానిదే తుది నిర్ణయం అవుతుందని పేర్కొంటున్నారు. పీఐబీపైనా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ పథకాలకు సంబంధించిన వార్తలను వెరిఫై చేసేందుకు 2019లో పీఐబీ ఫ్యాక్ట్‌చెకింగ్ యూనిట్‌ని నెలకొల్పారు. అయితే ఇది నిజానిజాలపై దృష్టిపెట్టకుండా, ప్రభుత్వ మౌత్‌పీస్‌గా మారిందనే ఆరోపణలు ఉన్నాయి. అలాగే ఏ న్యూస్‌పై ఫ్యాక్ట్ చెకింగ్ చేయాలో, దేన్ని వదిలేయాలో అన్నది కూడా పీబీఐనే నిర్ణయించే అవకాశం ఉంటుందని నిపుణులు పేర్కొంటున్నారు.
ముసాయిదాని తొలగించాలి..
ఈ ముసాయిదా సవరణలను కేంద్రం వెంటనే తొలగించాలని ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా(ఈజీఐ) కోరింది. ‘నకిలీ వార్తల నిర్ధారణ అధికారాన్ని కేంద్రం చేతుల్లో పెట్టడం ప్రెస్ సెన్సార్‌షిప్‌కు దారి తీస్తుంది’ అని ఈజీఐ బుధవారం ఒక ప్రకటనలో తెలిపింది.