హైదరాబాద్, మే 9 (నమస్తే తెలంగాణ): యుద్ధవార్తల ప్రసారంలో జాగ్రత్తలు పాటించాలని, ప్రజలకు చేరవేసే ముందే నిజానిజాలు నిర్ధారించుకోవాలని కేంద్ర సమాచార, ప్రసారశాఖ అన్ని మీడియా సంస్థలు, న్యూస్ ఏజెన్సీలకు ఆదేశాలు జారీచేసింది. దేశరక్షణ, భద్రతాపరమైన వార్తలు ప్రసారం చేసే సందర్భంలో బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, చట్టానికి లోబడి, నియమ నిబంధనలు పాటించాలని సూచించింది. ఈ మేరకు శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేసింది.
జాతీయ భద్రతా అంశాలను పరిగణనలోకి తీసుకొని, ఫ్యాక్ట్ చెక్ చేసుకొని వార్తలు ప్రసారం చేయాలని సూచించింది. ఉగ్రవాద నిరోధక చర్యలకు సంబంధించిన లైవ్ కవరేజీలు, వ్యక్తిగత అభిప్రాయాలు ఫేక్ వార్తలు ఇవ్వొద్దని సూచించింది. తప్పుడు సమాచారాన్ని సోషల్ మీడియాలో షేర్ చేస్తే చట్టపరమైన చర్యలకు బాధ్యులు అవుతారని హెచ్చరించింది. మతపరమైన, ఉద్రిక్తతలు కారణమయ్యే ఘటనల వీడియోలను షేర్ చేయొద్దని సూచించింది.