న్యూఢిల్లీ, ఆగస్టు 20: భారత్‌లో ‘డిజిటల్ నిరంకుశత్వం’ అమలవుతున్నదని తాజా నివేదిక పేర్కొన్నది. ఈ విధమైన నిరంకుశత్వాన్ని ప్రభుత్వాలే ప్రోత్సహిస్తున్న దేశాల జాబితాలో భారత్ కూడా ఉన్నదని తెలిపింది. పౌరులకు ఇంటర్నెట్ సదుపాయాన్ని నియంత్రించడం, విమర్శనాత్మక జర్నలిస్టులను ప్రభుత్వ వ్యతిరేకులుగా ముద్ర వేయడం, ఇంటర్నెట్ వేదికగా రాజకీయ ప్రత్యర్థుల పట్ల అమానవీయ చర్యలకు పాల్పడటం వంటి నిరంకుశ చర్యలకు దిగుతున్నట్టు ‘గ్లోబల్ వాయిసెస్ అడ్వోక్స్’ అనే యాంటీ సెన్సార్షిప్ నెట్వర్క్ ‘అన్‌ఫ్రీడమ్ మానిటర్’ నివేదికలో పేర్కొన్నది. భారత్‌తో సహా 20 దేశాలపై అధ్యయనం చేసింది.
పలు అంశాల ఆధారంగా నివేదిక
భారత్‌తో పాటు బ్రెజిల్, ఈక్వెడార్, ఈజిప్టు, రష్యా, మయన్మార్, టర్కీ తదితర దేశాల్లో డిజిటల్ రూపంలో అమలవుతున్న నిరంకుశత్వంపై అధ్యయనం చేశారు. ప్రభుత్వ విధానాలు, మానవ హక్కుల అమలు, పలు సూచీల్లో ర్యాంకులు, నిఘా సాంకేతికతలు, కమ్యూనికేషన్స్లను వినియోగిస్తున్న తీరుతెన్నుల ఆధారంగా నివేదిక రూపొందించారు. అణచివేత రాజకీయ ప్రయోజనాల కోసం టెక్నాలజీని వినియోగించడాన్ని డిజిటల్ నిరంకుశత్వంగా పేర్కొంటారు.
తరచూ ఇంటర్నెట్ ఆంక్షలు
భారత్‌లో ప్రధాని మోదీతోపాటు బీజేపీ నేతలు తమను ప్రమోట్ చేసుకొనేందుకు, రాజకీయ ప్రత్యర్థులు, మతపరమైన మైనార్టీలను ట్రోల్ చేసేందుకు సోషల్ మీడియాను వినియోగిస్తున్నారని నివేదిక ప్రస్తావించింది. దేశంలోని వివిధ ప్రాంతాల్లో ప్రజల ఆందోళనల నేపథ్యంలో తరచుగా ఇంటర్నెట్పై ఆంక్షలు విధిస్తున్నారని నివేదిక ఎత్తిచూపింది. విమర్శనాత్మక జర్నలిస్టులను ప్రభుత్వ వ్యతిరేకులుగా చిత్రీకరిస్తున్న దేశాల జాబితాలో భారత్ కూడా ఉన్నదని నివేదిక వెల్లడించింది.
అసమ్మతి గొంతుకను అణచివేసేందుకు..
దేశ భద్రత పేరుతో ఇంటర్నెట్పై నియంత్రణ తెచ్చుకొనేందుకు చట్టాలు చేస్తున్న దేశాల జాబితాలో భారత్ కూడా ఉన్నదని నివేదికలో వెల్లడించింది. పాలకులకు మీడియా, ఇతర కమ్యూనికేషన్ టెక్నాలజీతో సంబంధాలు ఉన్నాయని, తమ ప్రచార లక్ష్యాలను ముందుకు తీసుకెళ్లేందుకు వాటిని ఉపయోగించుకొంటున్నాయని పేర్కొన్నది. ఇదే సమయంలో వాస్తవాలు దాచేందుకు, దుర్వినియోగాలను కప్పిపుచ్చుకొనేందుకు, అధికారాన్ని నిలబెట్టుకొనేందుకు ఇతరులకు యాక్సెస్‌ను పరిమితం చేస్తున్నారని తెలిపింది.