న్యూఢిల్లీ, మార్చి 12: దేశంలో స్వలింగ వివాహాలకు చట్టబద్ధత ఇవ్వటం సాధ్యం కాదని కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలిపింది. ఇది చాలా సున్నితమైన అంశమని, భారతీయ కుటుంబ వ్యవస్థకు వ్యతిరేకమని పేర్కొన్నది. దేశంలో అమల్లో ఉన్న ఏ పర్సనల్ న్యాయ చట్టాల్లోగానీ, అధికారిక న్యాయ చట్టాల్లోగానీ ఈ అంశంపై సానుకూల ప్రతిపాదనలు లేవని కోర్టులో దాఖలు చేసిన అఫిడవిట్లో పేర్కొన్నది. ఇండియన్ పీనల్ కోడ్ (ఐపీసీ) సెక్షన్ 377 ప్రకారం మనదేశంలో స్వలింగ సంపర్కాలు, స్వలింగ వివాహాలు నిషేధం. దీంతో ఈ సెక్షన్ను ఎత్తివేసి స్వలింగ వివాహాలకు చట్టబద్ధత కల్పించాలని సుప్రీంకోర్టులో పలువురు పిటిషన్లు దాఖలు చేశారు. ఈ పిటిషన్లపై సోమవారం కోర్టు విచారణ జరుపనున్నది. దీనిపై కేంద్రం అభిప్రాయాన్ని కోరటంతో స్వలింగ వివాహాలను వ్యతిరేకిస్తూ అఫిడవిట్ దాఖలు చేసింది.
సమతూకం దెబ్బతింటది
స్వలింగ వివాహాలను చట్టబద్దం చేస్తే దేశంలోని పర్సనల్ లాకు సామాజిక విలువలకు మధ్య సమతూకం దెబ్బతింటుందని కేంద్రం తన అఫిడవిట్లో తెలిపింది. పిటిషనర్లు స్వలింగ వివాహాలను ప్రాథమిక హక్కుగా భావించటానికి వీలు లేదని స్పష్టంచేసింది. అదే సమయంలో సమాజంలో భిన్న లైంగిక సంబంధాలకు గుర్తింపునిచ్చే విషయంలో ప్రభుత్వానికి పరిధులు ఉన్నాయని పేర్కొన్నది. పశ్చిమదేశాల్లోని న్యాయశాస్ర్తాలను భారత్లోకి యథావిధిగా దిగుమతి చేసుకోలేమని తెలిపింది. మానవ సంబంధాలకు గుర్తింపునిచ్చే బాధ్యత చట్టసభలదేగాని, న్యాయవ్యవస్థది కాదని వాదించింది. ఈ అంశంపై పిటిషనర్లు కోర్టును ఆశ్రయించటం పూర్తిగా అసంబద్ధమని తెలిపింది.