పాఠశాల విద్యపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. కేంద్రం పరిధిలోని కేంద్రీయ విద్యాలయాలు, నవోదయ, సైనిక పాఠశాలల్లో ‘నో డిటెన్షన్’ విధానాన్ని రద్దు చేసింది. ఇక నుంచి విద్యార్థులు 5, 8వ తరగతుల వార్షిక పరీక్షల్లో పాసైతేనే పై తరగతులకు వెళ్లే వీలుంటుంది. ఫెయిలైతే రెండు నెలల్లోగా మళ్లీ పరీక్ష రాసి ఉత్తీర్ణత సాధించాలి. అప్పుడూ ఫెయిలైతే చదివిన తరగతే మరోసారి చదవాల్సి ఉంటుంది.
No Detention | (స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, డిసెంబర్ 23 (నమస్తే తెలంగాణ) : పాఠశాల విద్యకు సంబంధించి కేంద్రప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకొన్నది. ‘నో డిటెన్షన్’ విధానాన్ని రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది. దీంతో 5, 8 తరగతుల వార్షిక పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించని విద్యార్థులు పై తరగతులకు ప్రమోట్ కారని, ఫెయిలైనట్లేనని వెల్లడించింది. ఈ మేరకు సోమవారం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది.
‘నో డిటెన్షన్’ విధానాన్ని రద్దు చేస్తున్నట్టు కేంద్రం ప్రకటించడంతో.. కేంద్ర ప్రభుత్వ పరిధిలోని దాదాపు 3 వేల పాఠశాలల్లో తాజా నిబంధన అమల్లోకి రానున్నది. ఈ జాబితాలో కేంద్రీయ విద్యాలయాలు, నవోదయ స్కూల్స్, సైనిక్ పాఠశాలలు కూడా ఉన్నాయి.
పాఠశాల విద్య రాష్ట్ర జాబితాలోని అంశం గనుక ‘నో-డిటెన్షన్’ విధానం రద్దు విషయంలో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలే నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని అధికారులు పేర్కొన్నారు. హర్యానా, పుదుచ్చేరి ఈ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని తెలిపారు. మిగతా రాష్ర్టాలు మాత్రం ‘నో-డిటెన్షన్’ విధానానికే మొగ్గు చూపుతున్నట్టు వెల్లడించారు. తెలుగు రాష్ర్టాల్లో ‘నో-డిటెన్షన్’ విధానం కొనసాగుతున్నట్టు విద్యా నిపుణులు చెప్తున్నారు.
విద్యాహక్కుచట్టం-2019కు చేసిన సవరణల ప్రకారం.. దాదాపు 16 రాష్ర్టాలు, ఢిల్లీ సహా రెండు యూటీలు 5, 8వ తరగతులకు ఇప్పటికే ‘నో-డిటెన్షన్’ విధానాన్ని రద్దు చేశాయి. తాజాగా కేంద్రం కూడా ఈ విధానాన్ని రద్దు చేసింది.
విద్యాహక్కు చట్టం (ఆర్టీఈ)-2009 ప్రకారం.. ఒకటి నుంచి 8వ తరగతి వరకూ ఏ విద్యార్థినీ ఫెయిల్ చేయకూడదు. వార్షిక పరీక్షల్లో విద్యార్థి అనుకొన్న ప్రతిభ సాధించనప్పటికీ, పై తరగతులకు ప్రమోట్ చేయాల్సిందే. దీన్నే ‘నో-డిటెన్షన్’ విధానంగా పిలుస్తారు. అయితే, 2019లో ఆర్టీఈలో చేసిన సవరణల్లో ‘నో-డిటెన్షన్’ విధానాన్ని రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు. అయితే, పాఠశాల విద్య రాష్ట్ర జాబితాలోని అంశం గనుక ఆయా రాష్ట్రప్రభుత్వాలు ‘నో-డిటెన్షన్’ విధానంపై నచ్చిన విధంగా ముందుకు వెళ్లొచ్చని సూచించారు.