న్యూఢిల్లీ, జనవరి 11 : స్మార్ట్ ఫోన్ తయారీదారులు ఇకపై సోర్స్కోడ్ను ప్రభుత్వంతో పంచుకోవాలని, దీంతో పాటు పలు సాఫ్ట్వేర్లలో మార్పులు చేయాలని కేంద్రం ప్రతిపాదిస్తున్నది. ఈ ప్రతిపాదన ప్రకారం కంపెనీలు ముందుగా ఇన్స్టాల్ చేసిన యాప్లను అన్ ఇన్స్టాల్ చేయడానికి, కెమెరాలు, మైక్రోఫోన్లను ఉపయోగించకుండా నిరోధించడానికి సాఫ్ట్వేర్ మార్పులు చేయాల్సి ఉంటుంది. భద్రతా చర్యల్లో భాగంగా చేపట్టే ఈ చర్యలను స్మార్ట్ఫోన్ తయారీ దిగ్గజ కంపెనీలైన యాపిల్, శామ్సంగ్లు వ్యతిరేకిస్తున్నాయి. సుమారు 75 కోట్లకు పైగా ఫోన్లతో ప్రపంచంలోనే రెండో అతి పెద్ద మార్కెట్ అయిన భారత్లో డాటా చౌర్యం, యూజర్ల డాటా పరిరక్షణకు ఈ చర్యలు చేపట్టినట్టు కేంద్రం చెప్తున్నది.
కాగా, గత నెలలో ప్రతి ఫోన్లో సైబర్ సెక్యూరిటీ యాప్ను ఇన్స్టాల్ చేయాలంటూ ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాలు తీవ్ర వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. సర్వత్రా విమర్శలు, ఫోన్ల కంపెనీల ఒత్తిడితో ప్రభుత్వం తర్వాత వెనక్కి తగ్గింది. భారత్లో షియోమీ, శామ్సంగ్ ఫోన్లు వరుసగా 19, 15 శాతం, యాపిల్ ఫోన్లు 5 శాతం మార్కెట్ వాటాను కలిగి ఉన్నాయి. కాగా, సోర్స్ కోడ్ను ఇవ్వాలంటూ 2014-16 మధ్య చైనా చేసిన విజ్ఞప్తులను యాపిల్ తిరస్కరించింది. అలాగే అమెరికా లా ఎన్ఫోర్స్మెంట్ కూడా దీని కోసం ప్రయత్నించి విఫలమైంది.