న్యూఢిల్లీ: దేశంలో 6,324 డాల్ఫిన్లు ఉన్నట్టు తేలింది. కేంద్ర ప్రభుత్వం తొలిసారి నదీ ఆవాస డాల్ఫిన్లపై సర్వే నిర్వహించి, సోమవారం నివేదికను విడుదల చేసింది. ‘ప్రాజెక్ట్ డాల్ఫిన్’లో భాగంగా 8 వేల కిలోమీటర్ల పరిధిలో 2021-2023 మధ్య కాలంలో ఈ గణాంకాలు సేకరించారు.
ఈ డాల్ఫిన్లు గంగ, బ్రహ్మపుత్ర, సింధు నదులు, వాటి ఉప నదుల పరీవాహక ప్రాంతాల్లోనే ఉన్నాయని తెలిపింది. గంగా నది డాల్ఫిన్లకు ఎన్నో ప్రత్యేకతలుంటాయని, ఇవి గంగ-బ్రహ్మపుత్ర-మేఘన నదీ వ్యవస్థలు, వాటి ఉప నదుల్లో భారత్, బంగ్లాదేశ్, నేపాల్, భూటాన్ దేశాల్లో కనిపిస్తాయని నివేదిక వెల్లడించింది. ఈ తిమింగలాలతో దగ్గరి సంబంధం ఉన్న మూడు సింధు నది డాల్ఫిన్లు భారత్లోని సింధు నదిలో కనిపించాయని చెప్పింది.