(స్పెషల్ టాస్క్ బ్యూరో)హైదరాబాద్, నవంబర్ 10 (నమస్తే తెలంగాణ): ఎలక్టోరల్ బాండ్ల ద్వారా గత ఐదేండ్లలో లభించిన దాదాపు రూ.10,800 కోట్ల విరాళాల్లో రూ.8 వేల కోట్లకు పైగా విరాళాలను చేజిక్కించుకొన్న అధికార బీజేపీ.. కొత్త కుట్రకు తెరతీసింది. గుజరాత్, హిమాచల్‌ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదల కావటంతో బాండ్ల పథకం ద్వారా భారీ మొత్తంలో నిధుల సేకరణకు స్కెచ్ గీసింది.
ఇందులోభాగంగా గత సోమవారం ఎలక్టోరల్ బాండ్ల పథకంలో కేంద్ర ఆర్థిక శాఖ హడావిడిగా సవరణలు చేసింది. అసెంబ్లీ ఎన్నికలు జరిగే సంవత్సరంలో అదనంగా 15 రోజులు, సార్వత్రిక ఎన్నికలు జరిగే ఏడాదిలో అదనంగా 30 రోజులు పథకాన్ని ప్రవేశపెట్టడానికి అవకాశం కల్పించింది. ఇలా.. ఇప్పటివరకూ ఉన్న 40 రోజులతో కలిపి మొత్తంగా ఏడాదికి 85 రోజులు పొడిగించింది. ఈ మేరకు గత సోమవారం 23వ దఫా బాండ్ల జారీకి ప్రకటన విడుదల చేసింది. దేశవ్యాప్తంగా ఎస్బీఐ కేంద్రాల్లో బుధవారం నుంచి మొదలైన బాండ్ల అమ్మకాలు నవంబర్ 15 వరకు కొనసాగనున్నాయి.
అయితే, రాజకీయ పార్టీల సూచనలు స్వీకరించకుండా, ఎన్నికల సంఘానికి (ఈసీ) సమాచారం ఇవ్వకుండా, ఒకవైపు ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చాక.. బాండ్ల జారీ గడువు ఎలా పెంచుతారంటూ మోదీ సర్కారుపై విపక్షాలు, నిపుణులు మండిపడుతున్నారు. ఇది ముమ్మాటికీ ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించడమేనని ఆక్షేపిస్తున్నారు. కాగా, హిమాచల్‌ప్రదేశ్ అసెంబ్లీకి శనివారం పోలింగ్ జరుగనున్నది. డిసెంబర్ 1, 5 తేదీల్లో గుజరాత్ అసెంబ్లీకి ఎన్నికలు జరుగనున్నాయి. ఆ ఎన్నికల్లో ఆర్థికంగా లబ్ధి పొందేందుకే మోదీ సర్కారు ఈ ఏకపక్ష నిర్ణయానికి తెగబడిందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
ఫిజికల్ బాండ్ల కొనుగోళ్లు పైపైకి
డిజిటల్ ఎలక్టోరల్ బాండ్లతో పోలిస్తే, ఫిజికల్ ఎలక్టోరల్ బాండ్లలో పారదర్శకతపై ఎన్నో అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. అయితే, ఎన్నికలు జరగడానికి ముందు.. డిజిటల్ బాండ్ల విక్రయాలతో పోలిస్తే, ఫిజికల్ బాండ్ల విక్రయాలు ఎక్కువగా ఉండటం గమనార్హం. 2019 సాధారణ ఎన్నికలకు ముందు, ప్రస్తుతం గుజరాత్, హిమాచల్ ఎన్నికల ముందు ఫిజికల్ బాండ్ల కొనుగోళ్లు ఎక్కువగా ఉండటం చర్చనీయాంశంగా మారింది.
పొడిగింపు అందుకోసమే!
రానున్న అసెంబ్లీ ఎన్నికల కోసమే మోదీ సర్కారు ఎలక్టోరల్ బాండ్ల అమ్మకాన్ని మరో 15 రోజులు పొడిగించిందని టీఎంసీ జాతీయ అధికార ప్రతినిధి సాకేత్ గోఖలే విమర్శించారు. గుజరాత్ మోర్బీ వంతెన ప్రమాదానికి కారణమైన ఓరెవా కంపెనీ ఇప్పుడు దగ్గర్లోని ఎస్బీఐ బ్యాంకుకు డబ్బు సంచులతో హడావిడిగా పరుగెత్తాల్సి ఉంటుందని ఎద్దేవా చేశారు.