న్యూఢిల్లీ, ఫిబ్రవరి 2: పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ), ప్రతిపాదిత జాతీయ పౌరుల జాబితా (ఎన్ఆర్సీ)పై భారత్లో నిరసనలు ప్రజ్వరిల్లి ఆరేండ్లు దాటాయి. నాడు ఓ మతాన్ని లక్ష్యం చేసుకునేందుకే ఎన్పీఆర్ని ప్రభుత్వం తీసుకువస్తున్నట్లు సమాజంలోని ఓ వర్గం అనుమానించింది. దీంతో నిరసనలు తలెత్తడంతో ఎన్పీఆర్ గురించి ప్రభుత్వం నుంచి ఇప్పటివరకు ఉలుకు పలుకు లేదు. కాగా, 2026-27 కేంద్ర బడ్జెట్లో ప్రభుత్వం ఎన్పీఆర్ కోసం రూ. 6,000 కోట్లు కేటాయించింది.
అయితే ఎన్పీఆర్ని అప్డేట్ చేయడంపై ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని కేంద్ర హోం శాఖ పార్లమెంట్లో తెలిపింది. రూ.6.000 కోట్లను సెన్సస్, సర్వే అండ్ స్టాటిస్టిక్స్/రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా(ఆర్జీఐ) పేరుతో కేటాయింపులు జరిపారు. ఇందులో ఆఫీస్ ఆఫ్ ది రిజిస్ట్రార్ జనరల్ అండ్ సెన్సస్ కమిషనర్ ఆఫ్ ఇండియా, ఆర్జీఐకి చెందిన వివిధ పథకాలు, ఎన్పీఆర్, 2027 సెన్సస్ కోసం ఏర్పాట్లు వంటివి ఉన్నాయి. వీటిలో రూ. 218 కోట్లను పెట్టుబడి వ్యయంగా ప్రభుత్వం చూపింది.
ప్రజల జ్ఞాపకాల నుంచి ఎన్పీఆర్ కరిగిపోతుండగా ప్రభుత్వ రికార్డుల్లో మాత్రం అది కొనసాగుతున్నది. గతంలో కూడా సెన్సస్, సర్వే అండ్ స్టాటిస్టిక్స్ ఆర్జీఐ పేరిట కూడా కేటాయింపులు జరిగాయి. అయితే అది కార్యరూపం మాత్రం దాల్చలేదు. రానున్న ఆర్థిక సంవత్సరంలో దీని కోసం బడ్జెట్ కేటాయింపులు జరగడంతో ఎన్ఆర్సీ కార్యక్రమం జరగవచ్చన్న ఆందోళన కొన్ని వర్గాలలో ఏర్పడుతున్నది. ఎన్పీఆర్ డాటాను ఎన్ఆర్సీ తయారీలో ఉపయోగించడానికి పౌరసత్వ నిబంధనలు, 2003 అవకాశం కల్పిస్తున్నాయి.