న్యూఢిల్లీ : ఈ నెల 16న యెమెన్లో కేరళ నర్సు నిమిష ప్రియకు అమలుచేయనున్న మరణశిక్షను తప్పించడంలో తమకున్న అవకాశాలు చాలా పరిమితమని కేంద్ర ప్రభుత్వం సోమవారం సుప్రీంకోర్టుకు తెలియచేసింది. ఉరిశిక్షను తప్పించడానికి తమ శాయశక్తులా ప్రయత్నిస్తున్నామని తెలియచేసిన ప్రభుత్వం నిమిష ప్రియ కుటుంబం ఇవ్వచూపుతున్న బ్లడ్ మనీ(హత్యకు పరిహారం) అది వారి వ్యక్తిగత వ్యవహారమని స్పష్టం చేసింది.
దౌత్యపరమైన గుర్తింపు లేని కారణంగా నిమిషకు ఉరి తప్పించే విషయంలో తాము చేయగలిగింది ఏమీ లేదని అటా ర్నీ జనరల్ వెంకటరమణి కేంద్రం తరఫున సుప్రీంకోర్టుకు తెలిపారు. పాలక్కాడ్కు చెందిన నిమిష ప్రియ తన వ్యాపార భాగస్వామి తలాల్ అబ్దో మెహదీని హత్య చేసినట్లు యెమెన్ కోర్టులు నిర్ధారించి జూలై 16న ఉరిశిక్షను అమలు చేయనున్నాయి.