న్యూఢిల్లీ, జూలై 14: మీ మొబైల్ పాడైతే.. దాన్ని బాగు చేయించుకునేందుకు పెట్టే ఖర్చుతో కొత్తదే కొనుక్కోవచ్చని మీకు ఎప్పుడైనా అనిపించిందా..? చిన్న చిన్న సమస్యలకు దగ్గర్లోని దుకాణంలో రిపేయిర్ చేయిస్తే.. మళ్లీ పెద్ద సమస్య వచ్చిందని కంపెనీ సర్వీస్ సెంటర్‌కు వెళ్తే.. వేరేచోట ఇప్పటికే చేయించారని, వారంటీ వర్తించదని చెప్పడం మీకు అనుభవమైందా? దాని ఒరిజినల్ స్పేర్ పార్ట్స్ కావాలంటే ఆ కంపెనీవే కొనాల్సి వచ్చిందా..? వారు ఎంతచెబితే అంత సమర్పించుకోవాల్సి వచ్చిందా..? ఇలా అన్ని సందర్భాల్లో వినియోగదారుడే నష్టపోతున్నాడు. పైగా రిపేర్ చేయించకుండా పాత వాటిని పడేయడంతో పర్యావరణానికి కూడా హాని. పైగా పరికరాలతో పాటు వాటి రిపేయిర్, విడిభాగాల విషయంలో కంపెనీల గుత్తాధిపత్యం వల్ల వినియోగదారుడు ఎంచుకునే హక్కును కూడా కోల్పోతున్నాడు. దీంతో వీటన్నింటికీ చెక్ పెట్టాలని కేంద్రం యోచిస్తున్నది. త్వరలో ‘రైట్ టు రిపేర్’పాలసీ తెచ్చేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నది. అందుకోసం కేంద్ర వినియోదారుల వ్యవహారాల శాఖ ఒక కమిటీని నియమించింది. ఆ శాఖ అదనపు కార్యదర్శి నిధి ఖరే చైర్‌పర్సన్‌గా వ్యవహరిస్తారు. ఈ నెల 13న ఈ కమిటీ తొలిసారి సమావేశమైంది.
రైట్ టు రిపేర్ అంటే..
రైట్ టు రిపేర్ అంటే పాడైపోయిన వస్తువును మీకు నచ్చిన చోట రిపేయిర్ చేయించుకునే హక్కు. అంటే ఆ కంపెనీ సర్వీస్ సెంటర్లలోనే రిపేర్ చేయించుకోవాల్సిన పని ఉండ దు. నచ్చిన చోట తక్కువ ధరకే బాగు చేయించుకోవచ్చు.. మార్పులు చేయించుకోవచ్చు. ఆ తర్వాతా సర్వీస్ సెంటర్‌కు వెళ్తే వారంటీ వర్తించదని చెప్పడానికి వీలుపడదు. వారంటీ ఉన్నంత కాలం రిపేయిర్ చేయాల్సి ఉంటుంది. దీనివల్ల వస్తువు తయారీదారు, థర్డ్ పార్టీ బయ్యర్లు, అమ్మకందారుల మధ్య సమన్వయానికి దోహదపడుతుందని భావిస్తున్నారు. వ్యవసాయాధారిత పరికరాలు, మొబైల్ ఫోన్లు/ట్యాబ్లెట్లు, గృహోపకరణాలు, ఆటోమొబైల్ పరికరాలను ఈ రైట్ టు రిపేర్ కిందకు తీసుకురావాలని భావిస్తున్నారు.