Karnataka Elections | బెంగళూరు, మే 3 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ప్రతిపక్షాలు వారసత్వ రాజకీయాలకు పాల్పడుతున్నాయని, అవినీతికి పాల్పడున్నాయని పలికే బీజేపీనే ఆయా ‘రంగాల్లో’ మొదటి స్థానంలో ఉన్నది. అవినీతిని తారాస్థాయికి చేర్చి, కుటుంబ రాజకీయాలను ప్రోత్సహించడంలో బీజేపీ ముందున్నదని ఎన్డీటీవీ, లోక్‌నీతి సెంటర్ ఫర్ ది స్టడీ ఆఫ్ డెవలపింగ్ సొసైటీస్ సంయుక్తంగా నిర్వహించిన సర్వేలో కర్ణాటక ప్రజలు వెల్లడించారు.
40కి పైగా కేసులున్న బీజేపీ చిత్తాపుర అభ్యర్థి మణికంఠ రాథోడ్ తరపున ఈ నెల 6న నిర్వహించాల్సిన ప్రచార సభను ప్రధాని మోదీ రద్దు చేసుకొన్నారు. ఈ విషయా న్ని బీజేపీ నేత రవికుమార్ బుధవారం వెల్లడించారు. ఇటీవల చెన్నపట్టణలో రౌడీషీటర్‌తో సత్కా రం చేయించుకొన్న మోదీ.. గత నెల మండ్య పర్యటనలో మరో రౌడీషీటర్ రవికి అభివాదం చేయటం వివాదాస్పదమైంది. దీంతో రాథోడ్‌కు ప్రచారం చేయకూడదని మోదీ అనుకున్నట్టు తెలుస్తున్నది.
అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి ఓటు వేయడమంటే కన్నడిగులు ఆత్మగౌరవాన్ని హననం చేసుకొన్నట్టేనని మాజీ ప్రధాని వాజపేయి సలహాదారు సుధీంద్ర కులకర్ణి అభిప్రాయపడ్డారు. బుధవారం ఆయన హుబ్బళ్లిలో మీడియాతో మాట్లాడుతూ అటు కేంద్రంతో పాటు ఇటు రాష్ర్టాల్లో కూడా తన పాలనే ఉండాలని మోదీ అనుకొంటున్నారని, బీజేపీ పాలనలో రాష్ట్ర సీఎంకు విలువే ఉండదని అన్నారు. రాష్ట్ర బీజేపీ ప్రభుత్వం మోదీ, షాల కనుసన్నల్లో నడుస్తున్నదని, ఇది కన్నడిగుల ఆత్మగౌరవానికి విఘాతమని అన్నారు.
కొవిడ్ సమయంలో కరోనా బాధితులకు సాయం పేరుతో కర్ణాటక బీజేపీ ప్రభుత్వం భారీ అవినీతికి పాల్పడిందని సామాజిక కార్యకర్త టీజే అబ్రహం ఆరోపించారు. అద్దె అంబులెన్స్‌ల పేరిట రూ.26.34 కోట్లు దుర్వినియోగం చేసిందని పేర్కొంటూ లోకాయుక్తకు ఫిర్యాదు చేశారు.