Broadcasting Bill | న్యూఢిల్లీ, ఆగస్టు 12: ప్రసార సేవల నియంత్రణ బిల్లుపై కేంద్రం వెనక్కు తగ్గింది. ఇప్పటికే ప్రజలకు అందుబాటులో ఉన్న ముసాయిదాపై డిజిపబ్, ఎడిటర్స్ గిల్డ్ వంటి సంస్థల నుంచి అభ్యంతరాలు వచ్చాయి. ఈ ముసాయిదా తయారీలో డిజిటల్ మీడియా సంస్థలు, సామాజిక సంస్థలను సంప్రదించలేదని ఆరోపించాయి. దీంతో కేంద్ర సమాచార, ప్రసార శాఖ సోమవారం కీలక ప్రకటన చేసింది.
ముసాయిదాపై అక్టోబరు 15 వరకు సంప్రదింపులు జరుపుతామని, సూచనలు తీసుకుంటామని ప్రకటించింది. సంప్రదింపుల తర్వాత కొత్త ముసాయిదాను ప్రచురిస్తామని పేర్కొన్నది. కాగా, ఈ ముసాయిదా డిజిటల్ మీడియా, సోషల్ మీడియా ద్వారా వార్తల ప్రసారంపై ఆంక్షలు విధించేలా, ఇండిపెండెంట్ జర్నలిస్టుల గొంతు నొక్కేలా ఉందనే ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే.