న్యూఢిల్లీ, సెప్టెంబర్ 5: జనగణన 2027 ప్రక్రియలో భాగంగా గోవా, ఉత్తర్ ప్రదేశ్, పంజాబ్, మంచు ఉండని ఉత్తరాఖండ్ ప్రాంతాలలో జనాభా లెక్కింపు షెడ్యూల్ను కేంద్ర ప్రభుత్వం ముందుగానే చేపట్టింది. కేంద్ర ప్రభుత్వం శనివారం జారీచేసిన నోటిఫికేషన్ ప్రకారం ఈ రాష్ట్రాలు, ప్రాంతాల్లో జన గణన డిసెంబర్ 1 నుంచి 2027 జనవరి 4 వరకు జరుగుతుంది. అనంతరం జనవరి 5 నుంచి 9 వరకు సమీక్ష దశ నిర్వహిస్తారు. జన గణన చట్టం, 1948, జన గణన నియమావళి, 1990లో నిబంధనల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు నోటిఫికేషన్ పేర్కొన్నది.
భారత రిజిస్ట్రార్ జనరల్(ఆర్జీఐ) కూడా ఈ షెడ్యూల్ను ధృవీకరించారు. కాగా ఈ ఆకస్మిక చర్యను కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరామ్ రమేశ్ ప్రశ్నించారు. ఇది ప్రభుత్వ పేలవమైన ప్రణాళికను ప్రతిబింబిస్తుందని ఆయన విమర్శించారు. 2027లో నాలుగు రాష్ర్టాల్లో ఎన్నికలు జరగనున్నాయని ప్రభుత్వానికి తెలిసినప్పటికీ గణన ప్రక్రియను ఇప్పుడు ఎందుకు ముందుకు జరుపుతున్నారని ఆయన ప్రశ్నించారు.