US-Iran : అమెరికా-ఇరాన్ మధ్య కొనసాగుతున్న యుద్ధం ఎప్పుడు ముగుస్తుందో చెప్పలేని పరిస్తితి. ఈ యుద్ధం అమెరికాకు ఆర్థిక భారంగా మిగిలింది. ఈ యుద్ధం కోసం ట్రంప్ ప్రభుత్వం చేసిన వ్యయం 45.1 బిలియన్ డాలర్లుగా తేలింది. అంటే మన కరెన్సీలో రూ.4.32 లక్షల కోట్లు అని ట్రంప్ ప్రభుత్వం యూఎస్ కాంగ్రెస్కు తెలిపింది. దాదాపు ఏడు నెలల నుంచి సాగుతున్న ఈ యుద్ధం కోసం అమెరికా చేసిన ఖర్చు మన దేశంలోని అనేక రాష్ట్రాల వార్షిక బడ్జెట్తో సమానం.
ఇందులో 43.6 బిలియన్ డాలర్లు యుద్ధం కోసం ఖర్చుకాగా, 1.5 బిలియన్ డాలర్లు చమురు కోసం అయిన ఖర్చు. అయితే, ఇది అంచనా మాత్రమే. కచ్చితమైన, పూర్తిస్తాయి వివరాలు కాదు. గత ఫిబ్రవరి 28 నుంచి ఈ ఏడాది సెప్టెంబర్ 2 వరకు జరిగిన ఖర్చు మాత్రమే. ఈ వ్యయంలో మిలిటరీ స్థావరాల ధ్వంసం, అనేక బిల్డింగులు ధ్వంసం కావడం, వాటి మరమ్మతులకు సంబంధించిన ఖర్చుల్ని చేర్చలేదు. పూర్తిస్థాయి వ్యయ వివరాల్ని కూడా ప్రభుత్వం వెల్లడించలేదు. ప్రస్తుతం అంచనా వేసిన ఖర్చు.. గతంలో అంచనాలకు మించింది.
ప్రస్తుతం ఈ యుద్ధం కొనసాగుతున్నందున ఖర్చు భవిష్యత్తులో ఇంకా పెరిగే అవకాశం ఉంది. అమెరికా చేసిన వ్యయంలో మిస్సైల్స్, క్షిపణుల్ని అడ్డుకునే టెక్నాలజీ కోసమే ఎక్కువ ఖర్చు అయింది. ఇదే సమయంలో యుద్ధం కారణంగా చమురు సరఫరాలో ఇబ్బందులు ఎదురవ్వడం వల్ల కూడా ఆర్థిక భారం పెరిగింది. ఈ ఖర్చులకు ద్వైపాక్షిక సంబంధాలపై జరిగిన చర్చలు వంటివి అదనం.