చెన్నై, జూన్ 7: జాతీయ జనాభా లెక్కల సేకరణను(సెన్సస్) బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే జాప్యం చేస్తూ రహస్య అజెండాతో నియోజకవర్గాల పునర్విభజన(డీలిమిటేషన్) ప్రక్రియను చేపడుతోందని తమిళనాడు సీఎం, డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ ఆరోపించారు. ‘జన గణన జాప్యం ప్రమాదం కాదు, డీలిమిటేషన్ ప్రక్రియ యాదృచ్ఛికం కాదు’ అని ఆయన వ్యాఖ్యానించారు. ప్రమాదం మన గడప దాకా వచ్చిందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. జాతీయ జన గణనను, తదనంతరం డీలిమిటేషన్ ప్రక్రియను అమలు చేయడం వెనుక కేంద్రంలోని మోదీ ప్రభుత్వ దుష్ట కుట్ర దాగి ఉందని సోషల్ మీడియా పోస్టులో ఆయన ఆరోపించారు. అభివృద్ధి చెందిన రాష్ర్టాలు.. ప్రత్యేకంగా హిందీయేతర భాషలను మాట్లాడే దక్షిణాది రాష్ర్టాలు జనాభా నియంత్రణ విధానాలను పాటించినందుకు ఇప్పుడు శిక్షకు గురి కానున్నాయని ఆయన తెలిపారు.
ఏండ్ల తరబడి జనాభా నియంత్రణను ఏమాత్రం పట్టించుకోని రాష్ర్టాలు ఇప్పుడు పార్లమెంట్లో అదనపు సీట్లను బహుమతిగా పొందనున్నాయని ఆయన పేర్కొన్నారు. ఇది ఫెడరల్ వ్యవస్థను దెబ్బ తీయడమేనని, అభివృద్ధి సాధించిన రాష్ర్టాలను విస్మరించడమేనని ఆయన తెలిపారు. ఈ దుష్ట కుట్ర గురించి తాను ఇదివరకే హెచ్చరించానని, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు చిదంబరం కూడా ఇదే విషయాన్ని వివరించారని ఆయన పేర్కొన్నారు. అప్రమత్తంగా ఉండి దక్షిణాది ప్రాతినిధ్యాన్ని రక్షించుకునేందుకు వ్యూహాలు రూపొందించుకోవాల్సిన సమయం ఆసన్నమైందని స్టాలిన్ పిలుపునిచ్చారు. 2027లో చేపట్టనున్న జనాభా లెక్కల సేకరణ 1971 జన గణన స్థానాన్ని భర్తీ చేసి తదుపరి నియోజకవర్గాల పునర్విభజనకు ఆధారం కానున్నదని ఆయన తెలిపారు. దక్షిణాది రాష్ర్టాలను పణంగా పెట్టి పార్లమెంట్లో ప్రాతినిథ్యాన్ని తనకు అనుకూలంగా పునర్ వ్యవస్థీకరించుకోవడానికి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి ఇది అవకాశంగా మారనున్నదని స్టాలిన్ ఆందోళన వ్యక్తం చేశారు.