న్యూఢిల్లీ: జనాభా లెక్కలు, 2027 తొలి దశ ( హౌస్ లిస్టింగ్ ఆపరేషన్స్ ) ఏప్రిల్ 1 నుంచి సెప్టెంబర్ 30 వరకు జరుగుతుంది. అన్ని రాష్ర్టాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. దీని కోసం ప్రతి రాష్ట్రం/కేంద్ర పాలిత ప్రాంతం 30 రోజుల గడువును ప్రకటిస్తాయి. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం బుధవారం నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ జారీ చేసిన ఈ నోటిఫికేషన్ ప్రకారం, 30 రోజుల హౌస్ లిస్టింగ్ ప్రారంభానికి ముందు 15 రోజుల్లో సెల్ఫ్ ఎన్యూమరేషన్‌కు అవకాశం ఉంటుంది. పదేండ్లకోసారి జనాభా లెక్కలను సేకరిస్తారు.
2021లో నిర్వహించవలసిన ఈ కార్యక్రమం కొవిడ్ మహమ్మారి కారణంగా వాయిదా పడింది. దేశంలోని ప్రజల సంఖ్యను ఈ కార్యక్రమంలో సేకరిస్తారు. ఈ ప్రక్రియ రెండు దశల్లో జరుగుతుంది. మొదటి దశలో, హౌస్ లిస్టింగ్, హౌసింగ్ సెన్సస్ 2026 ఏప్రిల్ నుంచి సెప్టెంబరు వరకు జరుగుతుంది. రెండో దశలో, జన గణన (పాపులేషన్ ఎన్యూమరేషన్) 2027 ఫిబ్రవరిలో జరుగుతుంది. హౌస్ లిస్టింగ్, హౌసింగ్ సెన్సస్ దశలో దేశంలోని అన్ని రకాల ఇండ్లు, కుటుంబాలు, నిర్మాణాల వివరాలను నమోదు చేస్తారు.
జనగణన, 2027లో జనాభా లెక్కల సేకరణ దశలో కులాల లెక్కలను కూడా సేకరించనున్నట్లు కేంద్ర ప్రభుత్వం గతంలో ప్రకటించింది. కుల గణన 1881-1931 మధ్య కాలంలో బ్రిటిష్ పరిపాలనా కాలంలో జరిగింది. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత జనాభా లెక్కల సేకరణ నుంచి కులాలను తొలగించారు. నిరుడు ఏప్రిల్ 30న జరిగిన రాజకీయ వ్యవహారాలపై కేబినెట్ కమిటీ సమావేశంలో సెన్సస్‌లో కులగణనను చేర్చాలని నిర్ణయించారు. ఇది మొట్టమొదటి డిజిటల్ సెన్సస్. సుమారు 30 లక్షల మంది ఎన్యూమరేటర్లు జనాభా లెక్కలను సేకరిస్తారు.