Supreme Court : సీబీఎస్ఈ అనుబంధ విద్యా సంస్థల్లో త్రిభాషా విధానాన్ని తప్పనిసరి చేస్తూ ఇటీవల బోర్డు నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది తొమ్మిదో తరగతి నుంచి త్రిభాషా విధానాన్ని అమలు చేయబోతుంది. అయితే, సీబీఎస్ఈ తీసుకున్న ఈ నిర్ణయాన్ని సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. సీనియర్ లాయర్ ముకుల్ రోహత్గీ దీనిపై సుప్రీం కోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులు ఉన్నట్లుండి మూడు భాషలు ఎలా నేర్చుకుంటారని, ఆ తర్వాత పదో తరగతి పరీక్షలు ఎలా రాస్తారని ఆయన కోర్టులో ప్రస్తావించారు.
దీనిపై స్పందించిన సుప్రీం కోర్టు ఈ కేసు విచారణను వచ్చే వారం చేపడతామని తెలిపింది. త్రిభాషా విధానంపై సీబీఎస్ఈ ఇటీవలే నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది తొమ్మిదో తరగతి విద్యార్థులకు ఈ విధానాన్ని కచ్చితంగా అమలు చేయబోతున్నారు. ఇప్పటికే సీబీఎస్ఈ తరగతులు ప్రారంభమైనప్పటికీ.. జూలై 1 నుంచి మూడో భాష బోధన ప్రారంభం కానుంది. ఆర్1, ఆర్2, ఆర్3 కింద త్రిభాషను అమలు చేస్తారు. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020, నేషనల్ కరిక్యులమ్ ఫ్రేమ్‌వర్క్ ఫర్ స్కూల్ ఎడ్యుకేషన్ 2022 ప్రకారం.. సీబీఎస్ఈ తాజా నిర్ణయం తీసుకుంది. మూడు భాషల్లో రెండు భారతీయ భాషలు తప్పనిసరిగా నేర్చుకోవాలి.
మూడోది ఇండియన్ భాష అయినా ఉండొచ్చు.. లేదా విదేశీ భాష అయినా నేర్చుకోవచ్చు. త్రిభాషా విధానం కోసం సీబీఎస్ఈ మొత్తం 42 భాషల్ని ఎంపిక చేసి, వాటికి సంబంధించిన సిలబస్ రూపొందించింది. రాజ్యాంగంలోని ఎనిమిదవ షెడ్యూల్లో పొందుపర్చిన భాషలు ఏవైనా నేర్చుకోవచ్చు. పదో తరగతిలో వచ్చే ఏడాది త్రిభాషా విధానం అమలు చేస్తారు. అయితే, దీనికి బోర్డ్ ఎగ్జామ్ మాత్రం నిర్వహించరు. ఇంటర్నల్ మార్కుల ఆధారంగా తుది మార్కుల జాబితాలో కలుపుతారు.