న్యూఢిల్లీ, సెప్టెంబర్ 24: సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) 10, 12 తరగతి బోర్డు పరీక్షలు వచ్చే ఏడాది ఫిబ్రవరి 17 నుంచి నిర్వహించనున్నట్టు అధికారులు బుధవారం ప్రకటించారు. ఈ పరీక్షలకు బోర్డు తాత్కాలిక డేట్ షీట్‌ను ప్రకటించింది. 10వ తరగతి బోర్డు పరీక్షలు ఏడాదికి రెండుసార్లు నిర్వహించనుండటం ఇదే మొదటిసారి.
ఇందులో భాగంగా మొదటి విడత పరీక్షలు వచ్చే ఏడాది ఫిబ్రవరి 17 నుంచి మార్చి 6 వరకు, రెండో విడత బోర్డు పరీక్షలు మే 15 నుంచి జూన్ 1 వరకు జరుగుతాయని సీబీఎస్ఈ ఎగ్జామినేషన్ కంట్రోలర్ సన్యం భరద్వాజ్ వివరించారు. అయితే రెండో విడత పరీక్షలకు విద్యార్థి హాజరవ్వడం ఐచ్ఛికమని, మొదటి విడత కన్నా మెరుగైన మార్కుల కోసం విద్యార్థి రెండో దానికి కూడా హాజరు కావచ్చునని, రెండింటిలో ఆయా సబ్జెక్టులలో ఏ విడతలో ఎక్కువ మార్కులు వస్తాయో వాటినే పరిగణనలోకి తీసుకోనున్నట్టు చెప్పారు.
రెండింటికీ సిలబస్, పరీక్షా విధానం ఒకే విధంగా ఉంటాయన్నారు. అలాగే 10వ తరగతికి ఎలాంటి సప్లిమెంటరీ పరీక్షా విధానం ఉండదని తెలిపారు. రెండో విడత పరీక్షే సప్లిమెంటరీ కింద పనిచేస్తుందని ఆయన వివరించారు.కాగా, 12వ తరగతి బోర్డు పరీక్షలు ఫిబ్రవరి 17 నుంచి ఏప్రిల్ 9 వరకు జరుగుతాయన్నారు.