మంగళవారం 14 జూలై 2020
National - Jun 22, 2020 , 17:45:38

సీబీఎస్‌ఈ బోర్డు పరీక్షల నిర్వహణపై వీడని సందిగ్ధం!

సీబీఎస్‌ఈ బోర్డు పరీక్షల నిర్వహణపై వీడని సందిగ్ధం!

న్యూ ఢిల్లీ: సీబీఎస్‌ఈ బోర్డు పరీక్షల నిర్వహణపై సందిగ్ధం వీడడం లేదు. కరోనా నేపథ్యంలో పెండింగ్‌ పరీక్షలన్నింటినీ వాయిదావేయాలని విద్యార్థుల తల్లిదండ్రులు బోర్డుకు విజ్ఞప్తి చేశారు. కాగా, వచ్చే వారంలో పరీక్షలు నిర్వహిస్తామని సంబంధిత అధికారులు ఇప్పటికే షెడ్యూల్‌ విడుదల చేశారు. దీంతో విద్యార్థులతోపాటు వారి తల్లిదండ్రులు ఆందోళనకు గురవుతున్నారు. పరీక్షలు ఉంటాయా? ఉండవా? ఏదో ఒకటి చెప్పాలని బోర్డు అధికారులను నిలదీస్తున్నారు. కానీ, అధికారులు దీనికి సబంధించిన సమాచారమేమీ ఇవ్వడం లేదు. గవర్నమెంట్‌ ఆఫ్‌ ఇండియా ఆదేశాలను పాటిస్తామని మాత్రమే పేర్కొంటున్నారు. 

కరోనా నేపథ్యంలో పెండింగ్‌ పరీక్షలు వాయిదా వేయాలని విద్యార్థుల తల్లిదండ్రులు ఇప్పటికే సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అలాగే, పరీక్షల నిర్వహణ విషయంపై మరోసారి సమీక్షించాలని అపెక్స్‌ కోర్టు ఈ నెల 17న  బోర్డుకు సూచించింది. ఢిల్లీలో పరీక్షల నిర్వహణ ఎందుకు సాధ్యపడదో పేర్కొంటూ హెచ్‌ఆర్‌డీ మంత్రి రమేశ్‌ పోఖ్రియాల్‌ నిశాంక్‌కు ఆ రాష్ట్ర డిప్యూటీ సీఎం మనీశ్‌ సిసోడియా ఓ లేఖ కూడా రాశారు. ఈ నేపథ్యంలో మంత్రి రమేశ్‌ పోఖ్రియాల్‌ సీబీఎస్‌ఈ, ఎన్‌టీఏ, యూజీసీ, ఏఐసీటీఈ హెచ్‌వోడీలతో ఇటీవల సమావేశం నిర్వహించారు. కానీ వివరాలు వెల్లడించలేదు. ఇదిలా ఉండగా, పరీక్షల నిర్వహణపై సీబీఎస్‌ఈ బోర్డు తన నిర్ణయాన్ని సుప్రీంకోర్టులో మంగళవారం (ఈ నెల 23) వెల్లడించనుంది. దీంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రుల్లో ఉత్కంఠ నెలకొంది.logo