న్యూఢిల్లీ: ఒడిశాలో రెండు బొగ్గు గనుల కేటాయింపులో అక్రమాలు జరిగాయనే ఆరోపణలతో నమోదైన కేసులో నిందితులకు సీబీఐ ప్రత్యేక కోర్టు క్లీన్చిట్ ఇచ్చింది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొన్న కేంద్ర బొగ్గు గనుల శాఖ మాజీ కార్యదర్శి హెచ్‌సీ గుప్తా సహా ఐదుగురిని కోర్టు నిర్దోషులుగా ప్రకటించింది. 2006 – 08 మధ్యకాలంలో ఒడిశాలోని రాంపియా, డిప్‌సైడ్ ఆఫ్ రాంపియా బొగ్గు గనుల కేటాయింపులో అవకతవకలు జరిగాయనే ఆరోపణలతో సీబీఐ కేసు నమోదైంది. హెచ్‌సీ గుప్తాతో పాటు బొగ్గుగనుల శాఖ మాజీ సంయుక్త కార్యదర్శి కేఎస్ క్రోఫా, గనుల కేటాయింపు విభాగం మాజీ డైరెక్టర్ కేసీ సమారియాతో కలిసి నవభారత్ పవర్ ప్రైవేట్ లిమిటెడ్, దాని చైర్మన్ పీ త్రివిక్రమ ప్రసాద్, ఎండీ వై హరిశ్చంద్ర ప్రసాద్ నేరపూరిత కుట్రతో కేంద్ర బొగ్గు గనుల శాఖను మోసం చేశారని సీబీఐ చార్జ్‌షీట్ దాఖలు చేసింది. కంపెనీ నికర విలువ, గనుల కేటాయింపు కోసం భూమి విస్తీర్ణం విషయంలో నిజాలు దాచిపెట్టారని అభియోగాలు మోపింది.
సీబీఐదాఖలు చేసిన చార్జిషీట్లపై సుదీర్ఘ విచారణ జరిపిన ఢిల్లీ సీబీఐ ప్రత్యేక కోర్టు బుధవారం తుది తీర్పు వెలువరించింది. నిందితులు తప్పుడు వివరాలతో దరఖాస్తు చేశారనే ఆరోపణను సీబీఐ నిరూపించలేకపోయిందని జడ్జి సంజయ్ బన్సల్ పేర్కొన్నారు. ఈ కేసులో కుట్రకోణాన్ని నిరూపించడంలో ప్రాసిక్యూషన్ విఫలమైందన్నారు. నిందితులు అందరినీ నిర్దోషులుగా ప్రకటించారు.