న్యూఢిల్లీ: రెండేళ్ల కిందట డ్రగ్స్ ఆన్ క్రూయిజ్ కేసులో బాలీవుడ్ నటుడు షారుఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్‌ను అరెస్ట్ చేసిన యాంటీ నార్కోటిక్స్ మాజీ అధికారి సమీర్ వాంఖడే (Sameer Wankhede)పై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) శుక్రవారం అవినీతి కేసు నమోదు చేసింది. నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) మాజీ జోనల్ అధికారి నివాసాలతోపాటు 28 ప్రాంతాల్లో రైడ్ చేసింది. మరో ఇద్దరు ప్రభుత్వ ఉద్యోగులు, ఇద్దరు ప్రైవేట్ వ్యక్తులకు చెందిన ఢిల్లీ, ముంబై, కాన్పూర్, రాంచీలోని ఆస్తులను తనిఖీ చేసింది. డ్రగ్స్ ఆన్ క్రూయిజ్ కేసులో సమీర్ వాంఖడే, ఇతర అధికారులు లంచం డిమాండ్ చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. దీనిపై దర్యాప్తు చేయాలని సీబీఐని ఎన్సీబీ కోరింది. ఈ మేరకు ఎన్సీబీ లేఖ రావడంతో సీబీఐ రంగంలోకి దిగింది.
కాగా, ఇండియన్ రెవెన్యూ సర్వీస్ (ఐఆర్ఎస్) అధికారి అయిన సమీర్ వాంఖడే రెండేళ్ల కిందట నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ)కు బదిలీ అయ్యారు. 2021లో ముంబై జోనల్ డైరెక్టర్‌గా ఉన్నప్పుడు ఆ ఏడాది అక్టోబర్ 2న రాత్రి వేళ ముంబై తీరంలో ఉన్న కార్డెలియా క్రూయిజ్ షిప్లో రైడ్ చేశారు. ఆ నౌక నుంచి 3 గ్రాముల కొకైన్, ఐదు గ్రాముల మెఫెడ్రోన్, 21 గ్రాముల గంజాయి, 22 ఎమ్‌డిఎంఎ (ఎక్టసీ) మాత్రలు, రూ.1.33 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. షారుఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్‌తో సహా 14 మంది వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. పలు గంటలు ప్రశ్నించిన తర్వాత ఆర్యన్ ఖాన్‌తోపాటు మరో ఇద్దరిని అక్టోబర్ 3న అరెస్ట్ చేశారు. ఆ తర్వాత ఈ కేసుకు సంబంధించి మరో 17 మందిని ఎన్సీబీ అరెస్ట్ చేసింది. విదేశీ డ్రగ్స్ సరఫరాదారులతో ఆర్యన్ ఖాన్‌కు సంబంధం ఉందని, ఇందులో పెద్ద కుట్ర ఆరోపించింది. ఈ సంఘటన నాడు కలకలం రేపింది.
మరోవైపు ఈ ఆరోపణలకు ఎలాంటి ఆధారాలు లేవని బాంబే హైకోర్టు పేర్కొంది. ఆర్యన్ ఖాన్‌కు బెయిల్ ఇచ్చింది. అతడి అరెస్ట్‌కు దారి తీసిన క్రూయిజ్ షిప్ రైడ్‌పై దర్యాప్తు కోసం సిట్‌ను ఎన్సీబీ ఏర్పాటు చేసింది. ఆర్యన్‌పై వచ్చిన ఆరోపణలు అవాస్తవమని దర్యాప్తులో తేలింది. అలాగే షిప్‌పై రైడ్ చేసిన సమీర్ వాంఖడే బృందం పలు అక్రమాలకు పాల్పడినట్లు సిట్ గుర్తించింది. గత ఏడాది మే నెలలో 14 మందిపై చార్జ్‌షీట్ ఫైల్ చేయడంతోపాటు ఆర్యన్ ఖాన్‌కు క్లీన్ చిట్ ఇచ్చింది.
కాగా, సమీర్ వాంఖడేపై నాటి మహారాష్ట్ర మంత్రి నవాబ్ మాలిక్ కూడా పలు అవినీతి ఆరోపణలు చేశారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఆయన తిరిగి మాతృసంస్థకు బదిలీ అయ్యారు. ప్రస్తుతం చెన్నైలోని డీజీటీఎస్ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్నారు. తాజాగా సమీర్ వాంఖడేపై సీబీఐ అవినీతి కేసు నమోదు చేసింది. అలాగే క్రూయిజ్ షిప్ రైడ్ బృందానికి చెందిన మరో అధికారి విశ్వ విజయ్ సింగ్‌ను గత వారం సర్వీస్ నుంచి ఎన్సీబీ తొలగించింది.