న్యూఢిల్లీ: తప్పుడు కేసులో తనను ఇరికించమని ఒత్తిడి రావడం వల్లనే సీబీఐ అధికారి ఒకరు ఆత్మహత్యకు పాల్పడ్డారని ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా ఆరోపించారు. సీబీఐ అధికారులు ఇలాంటి కఠిన నిర్ణయం తీసుకునేలా వారిపై ఎందుకు తీవ్ర ఒత్తిడి తెస్తున్నారని ప్రధాని మోదీని ఆయన ప్రశ్నించారు. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీపై దర్యాప్తు చేస్తున్న సీబీఐ దీనిపై కేసు నమోదు చేసింది. ఈ నేపథ్యంలో గత నెలలో సిసోడియా నివాసంతోపాటు ఆయన బ్యాంకు లాకర్లను తనిఖీ చేసింది. కాగా, ఈ కేసు దర్యాప్తులో భాగమైన సీబీఐ అధికారి జితేంద్ర కుమార్, గత గురువారం తెల్లవారుజామున ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
ఈ నేపథ్యంలో ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా మీడియాతో సోమవారం మాట్లాడారు. ‘నన్ను తప్పుడు కేసులో ఇరికించాలని సీబీఐ అధికారిపై ఒత్తిడి తెచ్చారు. ఆయన ఆ ఒత్తిడిని తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నాడు’ అని ఆరోపించారు. సీబీఐ అధికారులు ఇలాంటి కఠిన నిర్ణయం తీసుకునేలా వారిని ఎందుకింత ఒత్తిడికి గురి చేస్తున్నారో అని ప్రధానిని అడగాలనుకుంటున్నానని అన్నారు. అలాగే బీజేపీ నేత సంబిత్ పాత్ర విడుదల చేసిన స్ట్రింగ్ ఆపరేషన్ వీడియో, ఆయన చేసిన ఆరోపణలను సిసోడియా ఖండించారు.