న్యూఢిల్లీ: సిక్కు వ్యతిరేక అల్లర్ల కేసులో కాంగ్రెస్ సీనియర్ నేత జగదీశ్ టైట్లర్‌కు ఇప్పుడప్పుడే ఉపశమనం లభించేలా లేదు. ఈ కేసు దర్యాప్తు చేస్తున్న సీబీఐ ఆయనపై ఇవాళ చార్జిషీట్ దాఖలు చేసింది. 1984 అక్టోబర్ 31న అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ సిక్కు కమ్యూనిటీకి చెందిన తన బాడీగార్డుల చేతిలోనే దారుణహత్యకు గురికావడంతో కాంగ్రెస్ శ్రేణులు ఆగ్రహంతో ఊగిపోయాయి. పలుచోట్ల సిక్కులను ఊచకోత కోశాయి.
ఇందిరాగాంధీ హత్య జరిగిన మరుసటి రోజే పంజాబ్‌లోని పుల్ బంగాశ్ ఏరియాలోని గురుద్వారాకు అల్లరి మూకలు నిప్పుపెట్టాయి. ఈ ఘటనలో ముగ్గురు సిక్కు పౌరులు దుర్మరణం పాలయ్యారు. అయితే, జగదీశ్ టైట్లరే అల్లరిమూకలను రెచ్చగొట్టి గురుద్వారాకు నిప్పుపెట్టించినట్లు ఆరోపణలు ఉన్నాయి. కానీ ఈ కేసు దర్యాప్తు చేపట్టిన సీబీఐ టైట్లర్‌కు వ్యతిరేకంగా సాక్ష్యాలు లేవంటూ క్లీన్ చిట్ ఇచ్చింది.
కానీ, 2015లో సాక్ష్యాధారాలు లభించాయంటూ ఆయనపై కేసును తిరగదోడింది. ఈ క్రమంలో గత ఏప్రిల్‌లో టైట్లర్ వాయిస్ శాంపిల్స్‌ను సీబీఐ తీసుకుంది. వాయిస్ శాంపిల్ ఇచ్చేందుకు ఫోరెన్సిక్ ల్యాబోరేటరీకి వెళ్లిన సందర్భంగా టైట్లర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ కేసులో తాను తప్పుచేసినట్లు తేలితే ఉరికంబం ఎక్కేందుకు తాను సిద్ధంగా ఉన్నానని ఆయన వ్యాఖ్యానించారు. కానీ, సీబీఐ మాత్రం టైట్లర్‌కు వ్యతిరేకంగా సాక్ష్యాలు లభించాయని చెబుతోంది.