DK Shivakumar | న్యూఢిల్లీ, జనవరి 5: అక్రమాస్తుల కేసులో కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకమార్పై సీబీఐ దర్యాప్తునకు గత ప్రభుత్వం ఇచ్చిన సమ్మతిని ఉపసంహరిస్తూ సీఎం సిద్ధరామయ్య నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొన్న నిర్ణయాన్ని సీబీఐ సవాల్ చేసింది. ఈ మేరకు కర్ణాటక హైకోర్టులో పిటిషన్ వేసింది. పిటిషన్‌పై శుక్రవారం విచారణ జరిపిన జస్టిస్ ఎస్ దీక్షిత్.. వాటిని డివిజన్ బెంచ్‌కు పంపాలని సీజేకు సిఫారసు చేశారు.
రాష్ట్రంలో ఈ తరహా కేసు మొదటిదని, ఇందులోని చట్టపరమైన సమస్యలను పరిశీలించేందుకు విస్తృత ధర్మాసనం అవసరమని అభిప్రాయపడ్డారు. అవినీతి నిరోధక, ఆదాయ పన్ను, మనీలాండరింగ్ నిరోధక చట్టాల్లోని నిబంధనలను న్యాయస్థానం విశ్లేషించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. అటు పిటిషన్‌దారులు, ఇటు ప్రభుత్వ తరపున న్యాయవాదుల వాదనలు విన్నానని, అయితే ఇలాంటి అపారమైన చట్టపరమైన సమస్యలు ఉండే అంశాన్ని ప్రధాన న్యాయమూర్తి ముందుకు తీసుకెళ్లాలని అభిప్రాయపడుతున్నట్టు పేర్కొన్నారు.