చెన్నై, మే 21: తమిళనాడులో అధికార డీఎంకే యువ నాయకుడు దైవసేయల్పై లైంగిక వేధింపుల కేసు నమోదైంది. రాజకీయంగా పదవులు దక్కించుకోవడం కోసం తన భార్యతో పాటు మరో 20 మంది మహిళలపై ఒత్తిడి చేస్తున్నాడనే అభియోగాలతో అరక్కోణం పోలీసులు ఎఫ్ఆర్ఆర్ నమోదుచేశారు. అరక్కోణంకు చెందిన దైవసేయల్ 20 ఏండ్ల కాలేజీ విద్యార్థినిని పెండ్లి చేసుకున్నాడని పోలీసులు చెప్పారు.
ఈ పెళ్లి సదరు యువతికి ఇష్టం లేదని తెలిపారు. ఈ నేపథ్యంలో పార్టీలో ఎదిగేందుకు, కీలక పదవులు దక్కించుకునేందుకు ప్రయత్నిస్తున్న దైవసేయల్ డీఎంకే సీనియర్ నాయకుల వద్దకు వెళ్లాలంటూ తన భార్యపై కొంతకాలంగా ఒత్తిడి చేస్తున్నాడు. దీంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనతో పాటు మరో 20 మంది యువతులను కూడా ఇలాగే వేధిస్తున్నాడని చెప్పారు. ఎఫ్ఆర్ఆర్ నమోదు చేసిన పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు.