న్యూఢిల్లీ: పశ్చిమ బెంగాల్‌కు చెందిన తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) ఎంపీ మహువా మోయిత్రాపై (Mahua Moitra) ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేశారు. జాతీయ మహిళా కమిషన్ (ఎన్సీడబ్ల్యూ) చీఫ్ రేఖా శర్మను సోషల్ మీడియాలో పోస్ట్ ద్వారా అవమానించినందుకు ఈ మేరకు చర్యలు చేపట్టారు. ఉత్తరప్రదేశ్‌లోని హత్రాస్ జిల్లాలో తొక్కిసలాట జరిగిన ప్రాంతాన్ని ఎన్సీడబ్ల్యూ చీఫ్ రేఖా శర్మ సందర్శించి పరిశీలించారు. ఈ సందర్భంగా ఒక వ్యక్తి ఆమెకు గొడుగు పట్టుకున్న వీడియో క్లిప్‌పై టీఎంసీ ఎంపీ మహువా మోయిత్రా ఎక్స్‌లో గురువారం స్పందించారు. రేఖా శర్మ తన కోసం గొడుగు ఎందుకు మోయలేదన్న ఒకరి ప్రశ్నకు ఆమె సమాధానం ఇచ్చారు. ‘ఆమె (రేఖా శర్మ) తన బాస్ పైజామాను పట్టుకోవడంలో చాలా బిజీగా ఉంది’ అని పేర్కొన్నారు.
కాగా, మహువా మోయిత్రా పోస్ట్‌పై ఎన్సీడబ్ల్యూ చీఫ్ రేఖా శర్మ స్పందించారు. ఆ పోస్ట్ ద్వారా తనను అవమానించినట్లు ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో భారతీయ న్యాయ సంహితలోని సెక్షన్ 79 కింద మహువా మోయిత్రాపై ఆదివారం కేసు నమోదు చేశారు. సోషల్ మీడియా ఎక్స్ నుంచి ఆ పోస్ట్ వివరాలు సేకరిస్తామని ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్ విభాగం పేర్కొంది. దీనిపై మరింతగా దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించింది.