హోస్పేట్: ఓ కుటుంబాన్ని మొత్తం కిరోసిన్ పోసి తగులబెడుతానని బెదిరించిన మంత్రిపై కేసు నమోదైంది. కర్ణాటకకు చెందిన పర్యాటక, పర్యావరణ శాఖ మంత్రి ఆనంద్ సింగ్.. ఓ భూ వివాదానికి సంబంధించి పోలప్ప అనే వ్యక్తి కుటుంబాన్ని బెదిరించారు. మాట వినకపోతే కుటుంబం మొత్తాన్ని తగులబెడుతా అని హెచ్చరించారు.
దాంతో పోలప్ప కుటుంబం మంత్రి ఆనంద్ సింగ్‌పై పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆ తర్వాత పోలీస్ స్టేషన్ ఆవరణలోనే పోలప్పతోపాటు ఆయన కుటుంబానికి చెందిన మరో ఐదుగురు సభ్యులు ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేశారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు వారిని రక్షించి ఆస్పత్రికి తరలించారు. మంత్రిపై ఎస్టీఎస్టీ అట్రాసిటీ చట్టంలోని 504, 506 సెక్షన్ల కింద కేసులు నమోదు కాగా, పోలప్ప కుటుంబంపై కూడా ఆత్మహత్యయత్నం కేసు నమోదైంది.
హోస్పేట్ జిల్లాలోని ఒక గ్రామంలో పోలప్ప కుటుంబానికి, వారి సామాజిక వర్గానికి మధ్య భూ వివాదం ఉన్నది. మంగళవారం మంత్రి ఆనంద్ సింగ్ ఆ గ్రామానికి వెళ్లగా పోలప్ప ప్రతివాదులు ఈ విషయాన్ని మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. సమస్యను పరిష్కరించాలని కోరారు. దాంతో మంత్రి పోలప్ప కుటుంబాన్ని పిలిపించి మాట్లాడారు. మంత్రి చూపించిన పరిష్కార మార్గానికి పోలప్ప కుటుంబం ఒప్పుకోకపోవడంతో.. మాట వినకపోతే కుటుంబాన్ని తగులబెడుతా అంటూ నోరుజారారు.