అహ్మదాబాద్: విద్యార్థి నాయకుడిపై దాడికి సంబంధించి బీజేపీ ఎమ్మెల్యే కుమారుడు, అతడి అనుచరులపై దాడి, కిడ్నాప్, హత్యాయత్నం కింద పోలీసులు కేసు నమోదు చేశారు. (Case Against BJP MLA’s Son) ఆ విద్యార్థి నేత దళిత వ్యక్తి కావడంతో ఎస్సీ, ఎస్టీ చట్టం సెక్షన్ కూడా చేర్చారు. గుజరాత్‌లోని రాజ్‌కోట్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. గొండాల్ నియోజకవర్గం బీజేపీ ఎమ్మెల్యే గీతాబా జడేజా కుమారుడు గణేష్ జడేజా గురువారం రాత్రి తన అనుచరులతో కలిసి కారులో ప్రయాణించాడు. కాంగ్రెస్ అనుబంధ సంస్థ అయిన నేషనల్ స్టూడెంట్స్ యూనియన్ ఆఫ్ ఇండియా (ఎన్ఎస్యూఐ) నగర యూనిట్ చీఫ్ సంజయ్ సోలంకి బైక్‌పై వెళ్తుండగా ఆ కారు దగ్గర నుంచి క్రాస్ చేసింది. దీంతో చూసుకుని కారు డ్రైవ్ చేయాలని గణేష్ జడేజాతో సంజయ్ అన్నాడు.
కాగా, ఆగ్రహించిన బీజేపీ ఎమ్మెల్యే కుమారుడు గణేష్ తన కారులో సంజయ్ బైక్‌ను అతడి ఇంటి వరకు ఫాలో అయ్యాడు. అక్కడ సంజయ్‌తో ఘర్షణకు దిగాడు. అయితే సంజయ్ తండ్రి గణేష్‌కు తెలియడంతో ఆయన జోక్యంతో అక్కడి నుంచి వెళ్లిపోయాడు.
మరోవైపు శుక్రవారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో సంజయ్ తన బైక్‌పై బయటకు వెళ్లాడు. బీజేపీ ఎమ్మెల్యే కుమారుడైన గణేష్ అనుచరులు కారుతో సంజయ్ బైక్‌ను ఢీకొట్టారు. కింద పడిన అతడిపై ఐదుగురు వ్యక్తులు కర్రలతో దాడి చేశారు. కారులోకి ఎక్కించి గణేష్ ఇంటికి తీసుకెళ్లారు. ఎన్ఎస్యూఐను వీడాలంటూ దారుణంగా కొట్టారు. ఆ తర్వాత భేసన్ క్రాస్‌రోడ్స్‌లో అతడ్ని వదలి వెళ్లిపోయారు.
కాగా, తనపై దాడి గురించి సంజయ్ సోలంకి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తనను కిడ్నాప్ చేయడంతోపాటు హత్యకు యత్నించినట్లు ఆరోపించాడు. ఈ నేపథ్యంలో దాడి, కిడ్నాప్, హత్యాయత్నం వంటి సెక్షన్ల కింద గణేష్, అతడి అనుచరులపై పోలీసులు కేసు నమోదు చేశారు. సంజయ్ దళిత వ్యక్తి కావడంతో ఎస్సీ, ఎస్టీ ఎట్రాసిటీ చట్టానికి సంబంధించిన సెక్షన్ కూడా చేర్చినట్లు పోలీస్ అధికారి తెలిపారు.