తిరువనంతపురం : ప్రముఖ కార్టూనిస్ట్ సీజే యేసుదాసన్(83) కొచ్చిలో బుధవారం తెల్లవారుజామున మృతి చెందారు. ఇటీవలే యేసుదాసన్కు కరోనా సోకడంతో ఆస్పత్రిలో చేరి చికిత్స పొందారు. కరోనా నెగిటివ్ నిర్ధారణ అయిన తర్వాత యేసుదాసన్ ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. ఇంటికి చేరుకున్న కొద్దిరోజులకే ఆయన ప్రాణాలు కోల్పోయారు. యేసుదాసన్ మృతిపట్ల కేరళ జర్నలిస్ట్ యూనియన్లు సంతాపం తెలిపాయి. యేసుదాసన్కు భార్య, ముగ్గురు కుమారులు ఉన్నారు. ప్రస్తుతం కేరళ కార్టూన్ అకాడమీ చైర్మన్గా కొనసాగుతున్నారు.
యేసుదాసన్ మృతి పట్ల ఢిల్లీకి చెందిన పాపులర్ కార్టూనిస్ట్ సుధీర్ నాథ్ తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. ప్రతి ఒక్కరికి యేసుదాసన్ గౌరవం ఇచ్చే వారని, ఒక మంచి కార్టూనిస్ట్ను కోల్పోయామని ఆవేదన చెందారు. యేసుదాసన్ నుంచి కార్టూన్ రంగంలో ఎన్నో మెళకువలు నేర్చుకున్నానని సుధీర్ నాథ్ తెలిపారు.