న్యూఢిల్లీ: కారులోని సీఎన్జీ సిలిండర్ పేలడంతో అది అదుపుతప్పింది. డివైడర్ పైనుంచి దూసుకెళ్లింది. ఇద్దరు ఎమ్మెల్యేలు ప్రయాణిస్తున్న ఎస్‌యూవీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆ ఇద్దరు ఎమ్మెల్యేలతో పాటు ఆ కారులోని నలుగురు గాయపడ్డారు. వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. (2 MLAs Among 6 Injured) దేశ రాజధాని ఢిల్లీలో ఈ సంఘటన జరిగింది. ఆదివారం రాత్రి 9.30 గంటల సమయంలో ఢిల్లీలోని రద్దీగా ఉండే ఐటీవో ప్రాంతంలో ఒక కుటుంబం ప్రయాణిస్తున్న స్విఫ్ట్ కారులోని సీఎన్జీ సిలిండర్ పేలింది. దీంతో ఆ వాహనంపై డ్రైవర్ నియంత్రణ కోల్పోయాడు.
కాగా, పీడబ్ల్యూడీ కార్యాలయం సమీపంలోని డివైడర్ పైనుంచి ఆ కారు దూసుకెళ్లింది. కిరారీ సిట్టింగ్ ఎమ్మెల్యే అనిల్ ఝా, కర్ణాటకకు చెందిన ఎమ్మెల్యే అభయ్ పటేల్ ప్రయాణిస్తున్న ఇన్నోవా ఎస్‌యూవీని బలంగా ఢీకొట్టింది. ఆ ఇద్దరు ఎమ్మెల్యేలతో పాటు స్విఫ్ట్ కారులో ఉన్న 32 ఏళ్ల అశుతోష్ పాండే, ఆయన భార్య, వారి ఇద్దరి చిన్న పిల్లలు ఈ ప్రమాదంలో స్వల్పంగా గాయపడ్డారు. ‘కర్ణాటక ప్రభుత్వం’ అని బోర్డు ఉన్న ఇద్దరు ఎమ్మెల్యేలు ప్రయాణించిన ఇన్నోవా ముందు భాగం ధ్వంసమైంది. అందులోని ఎయిర్బ్యాగ్లన్నీ తెరుచుకున్నాయి.
మరోవైపు ఈ ప్రమాదం గురించి తెలిసిన వెంటనే స్థానికులు, పోలీసులు స్పందించి సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన ఇద్దరు ఎమ్మెల్యేలు అనిల్ ఝా, అభయ్ పటేల్‌తోపాటు స్విఫ్ట్ కారులో ఉన్న నలుగురు కుటుంబ సభ్యులను ఎల్ఎన్జేపీ ఆసుపత్రికి తరలించారు. వారికి చికిత్స అందుతున్నదని, వారి పరిస్థితి నిలకడగా ఉన్నదని పోలీస్ అధికారి తెలిపారు. ఈ ప్రమాదంపై దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. అయితే ఈ ప్రమాదం కారణంగా ఐటీవో క్రాసింగ్ వద్ద కొంతసేపు ట్రాఫిక్‌కు అంతరాయం కలిగింది.