Road Accident | పశ్చిమ బెంగాల్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నదియా జిల్లాలో కారు బీభత్సం సృష్టించింది. చావ్రా ప్రాంతంలోని లక్ష్మీగచ్చా ప్రాంతంలో వేగంగా వచ్చిన కారు మూడు ఈ-రిక్షాలను ఢీకొట్టింది. ఈ ఘటనలో ఏడుగురు ప్రాణాలు కోల్పోగా.. మరో ఎనిమిది గాయాలకు గురయ్యారు. ఈ-రిక్షా డ్రైవర్లు ఈద్ సందర్భంగా షాపింగ్ చేసి ఇంటికి తిరిగి వస్తుండగా ఈ సంఘటన జరిగిందని పోలీసులు తెలిపారు. ఎదురుగా వేగంగా వస్తున్న ఎస్యూవీ వరుసగా మూడు ఈ-రిక్షాలను ఢీకొట్టింది. అందులో ఉన్న ఏడుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారని.. మరో ఎనిమిది మంది గాయపడ్డారని పేర్కొన్నారు. ఇందులో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని పేర్కొన్నారు. క్షతగాత్రులను ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నట్లు అధికారి తెలిపారు. కారును వదిలి పారిపోయిన డ్రైవర్ కోసం గాలిస్తున్నట్లు పోలీసులు వివరించారు.