న్యూఢిల్లీ: నైట్ షిఫ్ట్‌లో పనిచేసే మహిళలను అడ్డుకోలేమని సుప్రీంకోర్టు(Supreme Court) తెలిపింది. రాత్రి పూట పని చేయకూడదని వాళ్లకు చెప్పలేమని కోర్టు స్పష్టం చేసింది. నైట్ షిఫ్ట్‌ల నుంచి మహిళా డాక్టర్లకు విముక్తి కల్పిస్తూ బెంగాల్ సర్కారు తీసుకున్న నిర్ణయాన్ని సుప్రీంకోర్టు తప్పుపట్టింది. మహిళలకు మినహాయింపులు అవసరం లేదని, వాళ్లకు కేవలం సమాన అవకాశాలు కావాలని ఆర్జీ కర్ మెడికల్ కాలేజీ ఘటనపై నమోదు అయిన సుమోటో కేసు విచారణ సమయంలో కోర్టు పేర్కొన్నది. సీజేఐ చంద్రచూడ్ నేతృత్వంలోని బెంచ్ ఈ కేసులో తీర్పునిచ్చింది. జస్టిస్ జేబీ పర్దివాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం ఈ కేసును విచారించింది. మహిళ భద్రత దృష్ట్యా.. మహిళా డాక్టర్లు రాత్రిపూట పనిచేయ వద్దు అని కోర్టులో కేసు దాఖలైంది.
రాత్రిపూట పనిచేయవద్దు అని మహిళలకు ఎలా చెబుతాం, వాళ్లకు మినహాయింపులు కాదు, సమాన అవకాశాలు కావాలి, అన్ని పరిస్థితుల్లోనూ పనిచేసేందుకు మహిళా డాక్టర్లు ఆసక్తిగా ఉన్నారని, వాళ్లు కచ్చితంగా అన్ని పరిస్థితుల్లో పనిచేయాలని, బెంగాల్ సర్కారు తమ నిర్ణయాన్ని సరి చేసుకోవాలని, 12 గంటల షిఫ్ట్‌ను దాటేసి మహిళలు పనిచేయరాదు అని చెప్పలేమని, సైనిక దళాల్లో రాత్రి పూట పనిచేసే మహిళలు ఉన్నారని ధర్మాసనం తెలిపింది. ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం మహిళా డాక్టర్లకు రక్షణ ఇచ్చేందుకు వెనుకాడితే, అప్పుడు కేంద్ర ప్రభుత్వం వాళ్లకు రక్షణ ఇస్తుందని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా తెలిపారు.
నైట్ షిఫ్ట్ విషయంలో సవరణ చేస్తూ కొత్త నోటిఫికేషన్ జారీ చేస్తామని బెంగాల్ సర్కారు తరపున సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ తెలిపారు.