శ్రీనగర్: జమ్ముకశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల్లో ఆశించిన ఫలితాలు రానప్పుడు మాత్రమే ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్స్ (ఈవీఎం)పై ప్రశ్నించడం తప్పని అన్నారు. ఓటింగ్ యంత్రాంగంపై నమ్మకం లేని పార్టీలు ఎన్నికల్లో పోటీ చేయకూడదని సూచించారు. ఈవీఎంలపై ఆరోపణలు చేస్తున్న ‘ఇండియా’ బ్లాక్ పార్టీలకు తన వ్యాఖ్యలతో షాక్ ఇచ్చారు. బ్యాలెట్ పద్ధతిలో ఓటింగ్‌కు డిమాండ్ చేస్తున్న ప్రతిపక్ష కూటమిలో భాగమైన ఒమర్ అబ్దుల్లా పీటీఐ వార్తా సంస్థకు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఓటింగ్ పద్ధతిని ప్రశ్నించడంలో ‘స్థిరంగా’ ఉండాలని తెలిపారు. గెలిచినప్పుడు ఒక విధంగా, ఓడినప్పుడు మరో విధంగా మాట్లాడకూడదని హితవు పలికారు.
కాగా, ఫలితాలు అంచనాలకు అందనప్పుడు మాత్రమే ఈవీఎంలను ప్రశ్నించడం తప్పు అని కాంగ్రెస్‌కు ఒమర్ అబ్దుల్లా చురక వేశారు. ‘అవే ఈవీఎంలతో మీరు (కాంగ్రెస్) వంద మందికి పైగా పార్లమెంటు సభ్యులను పొందారు. మీ పార్టీ విజయంగా దానిని సెలబ్రేట్ చేసుకున్నారు. కొన్ని నెలల తర్వాత ఆశించిన విధంగా ఫలితాలు రానప్పుడు ఈవీఎంలకు వ్యతిరేకంగా మాట్లాడకూడదు. ఓటింగ్ యంత్రాంగంపై నమ్మకం లేని పార్టీలు ఎన్నికల్లో పోటీ చేయకూడదు’ అని అన్నారు.
మరోవైపు ఓటర్లు ఒకసారి ఎన్నుకుంటారని, మరోసారి ఎన్నుకోరని ఒమర్ అబ్దుల్లా తెలిపారు. దీనికి తానే ఉదాహరణ అని అన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో ఓడిన తాను అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచినట్లు చెప్పారు. అయితే తాను ఎప్పుడూ కూడా ఈవీఎంలను నిందించలేదని అన్నారు.