Rajnath Singh : బీహార్ (Bihar) ప్రతిపక్ష కూటమి మహాగఠ్‌బంధన్ (Mahagatbandhan) లోని ప్రధాన పార్టీల నాయకులైన రాహుల్‌గాంధీ (Rahul Gandhi), తేజస్వియాదవ్ (Tejashwi Yadav), లాలూప్రసాద్ యాదవ్ (Lalu Prasas Yadav) పై రక్షణ మంత్రి (Defence minister) రాజ్‌నాథ్ సింగ్ (Rajnath Singh) తీవ్ర విమర్శలు గుప్పించారు. వారు నీతిలేని రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు.
తాము అధికారంలోకి వస్తే ఇంటింటికి ఒక ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని మహాకూటమి నేతలు తమ మేనిఫెస్టోలో పేర్కొనడంపై రాజ్‌నాథ్ ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇంటికో ప్రభుత్వ ఉద్యోగం సాధ్యమేనా అని ప్రశ్నించారు. బీహార్‌లో సుమారుగా 2.70 కోట్ల ఇండ్లు ఉన్నాయని, అన్ని ప్రభుత్వం ఉద్యోగాలు ఇవ్వడం ఎలా సాధ్యమని అన్నారు.
అధికార పార్టీ గెలిచినా అన్ని ఉద్యోగాలు ఇవ్వడం సాధ్యం కాదని రాజ్‌నాథ్ చెప్పారు. ప్రతిపక్ష కూటమి నేతలు ఇంత పచ్చిగా అబద్దాలు ఎందుకు చెబుతున్నారని ప్రశ్నించారు. ఇవాళ బీహార్‌లోని బార్హ్‌లో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో రక్షణ మంత్రి ప్రసంగించారు. రాహుల్‌గాంధీ, తేజస్వి యాదవ్, లాలూ యాదవ్‌లకు నీతిమంతమైన రాజకీయాలు చేయడం రాదా..? అని ఎద్దేవా చేశారు.