లక్నో : మధుమేహంతో బాధపడుతున్న కుమార్తెకు ఇన్సులిన్ కొనలేకపోతున్నానంటూ లక్నోలోని ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారి ఆత్మహత్య చేసుకున్నారు. అంతకుముందు ఆయన ఫేస్బుక్ లైవ్లో కన్నీళ్లతో, భావోద్వేగంతో మాట్లాడారు. తాను కోట్లాది రూపాయల అప్పుల ఊబిలో కూరుకుపోయానని చెప్పారు. ఇక ఎంత మాత్రం తాను ఆర్థిక ఒత్తిళ్లను తట్టుకోలేనన్నారు.
ఆర్థిక వనరులకు సంబంధించిన అన్ని మార్గాలు మూసుకుపోయాయని, తనకు పారిశ్రామిక, సినీ రంగాల వారు సాయం చేయాలని కోరారు. ఈ లైవ్ వీడియోను ఆయన కుటుంబ సభ్యులు చూసి, వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. వీరంతా ఆ వ్యాపారి ఉన్న ప్రదేశానికి చేరుకునే లోగానే ఆయన సెక్యూరిటీ గార్డు దగ్గర ఉన్న తుపాకీతో కాల్చుకుని మరణించారని పోలీసులు చెప్పారు. అప్పుల వల్ల ఆయన మానసికంగా కుంగిపోయారని తెలిపారు.