న్యూఢిల్లీ : కాలం చెల్లిన ఆయుధాలతో ఆధునిక యుద్ధాలను భారత్ గెలవలేదని త్రివిధ దళాధిపతి (సీడీఎస్) జనరల్ అనిల్ చౌహాన్ పేర్కొన్నారు. విదేశీ సాంకేతికతపై ఆధారపడటం వల్ల మన సన్నద్ధత బలహీనమవుతుందని హెచ్చరించారు. దేశీయంగా తయారుచేసే ఆయుధాలపై దృష్టి పెడుతూనే భవిష్యత్తుకు ఉపయోగపడే సాంకేతికతను అందిపుచ్చుకోవాలని అన్నారు. ఆపరేషన్ సిందూర్ సందర్భంగా పాకిస్థాన్ ప్రయోగించిన డ్రోన్లను, ఇతర ఆయుధాలను భారత్ ఎటువంటి నష్టం లేకుండా ఎలా ఎదుర్కొన్నదీ వివరించారు. ఢిల్లీలో బుధవారం జరిగిన డిఫెన్స్ వర్క్‌షాప్‌లో ఆయన మాట్లాడారు. ఆపరేషన్ సిందూర్ సమయంలో మే 10న పాకిస్థాన్ నిరాయుధ డ్రోన్లను పంపిందని చెప్పారు.
వాటి వల్ల భారత సైన్యానికి గానీ లేదా పౌర సదుపాయాలకు గానీ ఎటువంటి నష్టం కలుగలేదని అన్నారు. ఆ డ్రోన్లలో అనేకం కూల్చివేశామని తెలిపారు. ‘నిన్నటితరం ఆయుధాలతో నేటి యుద్ధాలలో విజయం సాధించలేము. నేటి యుద్ధంలో పోరాడాలంటే రేపటితరం సాంకేతికత కావాలి’ అని వ్యాఖ్యానించారు. మన మిషన్ల కోసం దిగుమతి చేసుకున్న సాంకేతికతపై ఆధారపడలేమని చెప్పారు. విదేశీ సాంకేతికతపై ఆధారం మన సన్నద్ధతను బలహీనపరుస్తుందని అన్నారు. పరిణామాత్మక మార్పులు మన ఆయుధాలను చిన్నవిగా, వేగవంతమైనవిగా, తేలికైనవిగా, మరింత సమర్థమైనవిగా, చౌకైనవిగా చేశాయని చెప్పారు. ఒకప్పుడు మన వద్ద భారీ, బరువైన రైఫిళ్లు ఉండేవని, ఇప్పుడు అవి చిన్నగా, తేలికగా ఉంటూ సుదూర లక్ష్యాలను ఛేదించేవిగా ఉన్నాయని వివరించారు.