న్యూఢిల్లీ, అక్టోబర్ 21: కొవిడ్-19 కాలంలో కోట్లాదిమంది ప్రజలకు రక్షణ కవచంగా నిలిచిన హ్యాండ్ శానిటైజర్ తయారీలో ప్రధాన ముడిపదార్థమైన ఇథనాల్ కారణంగా క్యాన్సర్ ముప్పు ఉందని తాజా పరిశోధనల్లో తేలడంతో ఇథనాల్‌ను నిషేధించాలని యూరోపియన్ యూనియన్ యోచిస్తున్నది. కొవిడ్-19 కాలం నుంచి ప్రజలకు అత్యవసర వస్తువుగా మారిన ఆల్కహాల్ ఆధారిత క్రిమిసంహారకాల భవిష్యత్తుపై పలు ప్రశ్నలను ఈయూ ప్రతిపాదన లేవనెత్తుతున్నది.
యూరోపియన్ కెమికల్స్ ఏజెన్సీ(ఈసీహెచ్ఏ) పరిధిలోని వర్కింగ్ గ్రూపులలో ఒకటి ఇథనాల్‌ను ప్రమాదకర వస్తువుగా నిర్ధారిస్తూ అక్టోబర్ 10న అంతర్గత సిఫార్సు చేసింది. క్యాన్సర్ ముప్పు, గర్భిణులకు ఆరోగ్య సమస్యలు ఇథనాల్ వల్ల పెరిగే ప్రమాదం ఉందని ఆ గ్రూపు తన నివేదికలో హెచ్చరించింది. ప్రమాదకరం కాని వస్తువులను శుభ్రం చేయడంలో ఇథనాల్‌ను ప్రత్యామ్నాయంగా వాడుకోవచ్చని నివేదిక సూచించింది. ఈ నివేదికను సమీక్షించేందుకు ఈసీహెచ్ఏకి చెందిన బయోసైడల్ ప్రొడక్ట్స్ కమిటీ నవంబర్ 25-28 తేదీలలో సమావేశం కానున్నది. సమావేశంలో కమిటీ ఇథనాల్‌ని హానికర వస్తువుగా నిర్ణయించిన పక్షంలో దీని ప్రత్యామ్నాయాన్ని కూడా సిఫార్సు చేయాల్సి ఉంటుంది.
వైరస్లు, బ్యాక్టీరియా, ఫంగీలను అత్యంత సమర్థంగా సంహరించడంలో ఇథనాల్‌కు గుర్తింపు ఉంది. శానిటైజర్లలో దీన్ని ఉపయోగించడమే కాకుండా దవాఖానలు, ఆహార ఉత్పత్తి, నిత్యం పరిశుభ్రం చేసుకునే వస్తువులలో కూడా దీని వాడకం అధికంగా ఉంది. 1990వ దశకం నుంచి ఆల్కహాల్ ఆధారిత క్రిమిసంహారకాలను అత్యవసర మందుల జాబితాలో ప్రపంచ ఆరోగ్య సంస్థ చేర్చింది. ఏటా ప్రపంచవ్యాప్తంగా కోట్లాది ఇన్ఫెక్షన్లను హ్యాండ్ శానిటైజర్లు నిరోధిస్తున్నాయి. మలేరియా, టీబీ, ఎయిడ్స్ వంటి రోగాల కన్నా ఎక్కువ మంది ప్రజలు ఇన్ఫెక్షన్ల కారణంగా మరణిస్తున్నట్లు ఆరోగ్య శాఖ వర్గాలు తెలియచేశాయి. ఏటా 1.6 కోట్ల మంది ప్రజలు ఇన్ఫెక్షన్ల నుంచి ఈ ఆల్కహాల్ ఆధారిత క్రిమిసంహారకాల కారణంగా ప్రాణాలు రక్షించుకోగలుగుతున్నట్లు తెలుస్తోంది.
ఇథనాల్‌పై నిషేధం విధిస్తే మరింత ప్రమాదకర రసాయనమైన ఐపోప్రొపనాల్ను ప్రత్యామ్నాయంగా పరిశీలించే అవకాశం ఉంది. అయితే సోపుతో చేతులు శుభ్రం చేసుకోవడం వల్ల సమయం ఎక్కువ వృథా కావడమేగాక చేతులపై చర్మం దెబ్బతినే ప్రమాదం ఉంది. అయితే ఇప్పటివరకు బహిర్గతం చేయని అంతర్గత నివేదిక శాస్త్రీయ చెల్లుబాటును సోప్స్, డిటర్జెంట్స్, మెయింటేనెన్స్ ప్రాడక్ట్స్ ఇంటర్నేషనల్ అసోసియేషన్‌కు చెందిన ఈయూ అఫేర్స్ డైరెక్టర్ నికోలే వైనీ ప్రశ్నించడం విశేషం.